హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరుగనున్నాయి. గోపీనాథ్ అంతిమ సంస్కారాలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా దవాఖానలో ఆయన చికిత్సకు అయిన ఖర్చును చెల్లించనున్నట్లు వెల్లడించింది.
గత మూడు రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. అనంతరం ఆయన బౌతికకాయాన్ని మాదాపూర్‌లోని నివాసానికి తరలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, పద్మారావు గౌడ్, వివేకానంద్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, పార్టీ నేతలు వినోద్ కుమార్, మాలోత్ కవిత, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. గోపీనాథ్‌ను చివరిసారిగా చూసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు, పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. గోపీనాథ్ భూతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.