Congress | హైదరాబాద్, మే29(నమస్తే తెలంగాణ): నికార్సైన మాదిగ నేతకే మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌తో రాహుల్ గాంధీని కలవటానికి ఢిల్లీ వెళ్లిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైనట్టు సమాచారం. రోజంతా ఎదురుచూసినా ఏఐసీసీ అగ్రనేతలెవరూ వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గురువారం రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జునఖర్గేను కలవడానికి వారు ప్రయత్నించారట. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేరని ఆయన కార్యాలయం సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.
ఇక రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్పై స్పష్టత రాలేదని సమాచారం. దీంతో వారు తీవ్రంగా నిరాశ చెందినట్టు చెప్తున్నారు. తెలంగాణలో మాదిగలు 47 లక్షల మంది ఓటర్లుగా ఉన్నారని, ఇటీవలి ఎన్నికల్లో వీరంతా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలబడి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారని ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయినా నికార్సైన మాదిగ నేతకు క్యాబినెట్లో స్థానం దకలేదని, ప్రస్తుతం మంత్రిగా ఉన్న నేత మాదిగ ఉప కులానికి చెందిన వ్యక్తి అని వాదిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో తమకు మాదిగలకు స్థానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.