జగిత్యాల రూరల్, అక్టోబర్ 26: అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను కాపాడుకునేందుకు, రాజకీయ భవిష్యత్తు కోసమే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుచరుడు జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మారు గంగారెడ్డి (58) ఇటీవల దారుణ హత్యకు గురి కాగా శనివారం ఆయన భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లను మధుయాష్కీగౌడ్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్‌తో కలిసి గంగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో కొత్తగా చేరిన వారి అనుచరులకు నామినేటేడ్ పోస్టులు ఇస్తామని ఏ హామీ ఇవ్వలేదని స్పష్టంచేశారు.
జగిత్యాల పోలీసుల నిర్లక్ష్యంతోనే గంగారెడ్డి హత్య జరిగిందని, ఆయన హత్యకు గురికావడం బాధాకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, కాంగ్రెస్ నాయకులు హత్యకు గురికావడం దురదృష్టకరమని వాపోయారు. ఎవరి ప్రోద్బలం, ఎవరి అండతో పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారో తెలియాలని, గంగారెడ్డి హత్యపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫిరాయింపులతో కాంగ్రెస్ క్యాడర్ అంతా ఆత్మైస్థెర్యం కోల్పోయిందని వాపోయారు. గంగారెడ్డి హత్యలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని, ఆయనను వాట్సాప్‌లో బెదిరించినా జగిత్యాల పోలీసులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. డయల్ 100కు ఫోన్ చేసినా పోలీసుల నుంచి రెస్పాన్స్ రాలేదని చెప్పారు. దసరా పండుగ రోజున డీజేలు పగులగొట్టినా పట్టించుకోలేదని, కుట్రలు, వాస్తవాలను వెలికితీయకుండానే పాతకక్షలు అని పోలీసులు చెప్తున్నారని, ఓ నేరస్థుడు పోలీస్ స్టేషన్లో రీల్స్ చేసినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ఉన్నతాధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు.