హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): పదవుల కోసం పార్టీలు మారే కాన్సెప్ట్‌ను రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి, రాజకీయ ఊసరవెల్లి రేవంత్‌రెడ్డి అని శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి విమర్శించారు. సమకాలీన రాజకీయాల్లో ఇన్ని పార్టీలు మారిన నాయకుడు లేరని ఆరోపించారు. మోసపూరిత హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డికి, సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి పంచిన కేసీఆర్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ పెట్టిన పోల్‌లో ప్రజావ్యతిరేకత వెల్లువెత్తగా.. వాటిని సవరించుకోవాల్సిందిపోయి ఇష్టారీతిన మాట్లాడటం రేవంత్ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.
రేవంత్ పాలనను హైకమాండ్‌కు తెలిపేందుకే సొంత పార్టీ నేతలు పోల్ నిర్వహించారని తెలిపారు. తనకు వ్యతిరేకంగా పోల్ ఫలితం రావడంతో రేవంత్ ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్‌పై నోరు పారేసుకుంటున్నాడని ఆరోపించారు. 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ మౌనం తర్వాత ఏం జరిగిందో రాజకీయ ఉద్దండులకు తెలుసని పేర్కొన్నారు. చంద్రబాబు, వైఎస్ లాంటి నేతలకు కేసీఆర్ చుక్కలు చూపించారని గుర్తుచేశారు. పాలనా వైఫల్యాలను, ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాక్షేత్రంలో కార్యకర్తలు దీటుగా ఎదుర్కొంటామని తెలిపారు.