శాయంపేట, ఆగస్టు 10 : బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా కాలయాపన చేస్తే కాంగ్రెస్‌కు బీసీలంతా కలిసి మరణశాసనం రాయడం ఖాయమని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల పక్షాన నిలిచి వారి అభ్యున్నతికి కృషి చేసింది బీఆర్ఎస్ ఒక్కటేనని స్పష్టంచేశారు.
‘42% రిజర్వేషన్లు కావాలని బీసీలు అడగలేదు. మేమెంతో మాకంత కావాలని అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీయే 42% రిజర్వేష న్లు కల్పిస్తామని చెప్పింది. ఇప్పుడు మోసం చేస్తమంటే ఇంతకు మించిన అన్యాయం, అవమానం ఉండదు. మేము అడిగింది ఇవ్వరు, చెప్పిందన్న ఇవ్వాలి’ అని అడుగుతున్నట్టు చెప్పారు. దేశంలో మెజారిటీ ఉన్న బీసీలను కాంగ్రెస్ ఎందుకు రాజ్యాధికారానికి దూరం చేసిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఏటా వేల కోట్లు ఖర్చు చేశామని, రూ.50 లక్షల బడ్జెట్ ఉన్న దేశంలో రెండు, మూడువేల కోట్లు పెట్టడమేంటని ప్రశ్నించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను బిచ్చగాళ్ల కంటే హీనంగా చూస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ మొదటి నుంచి ఒకే మాటపై ఉన్నదని, రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడమే సమస్యకు పరిష్కారమని సూచించారు. ఢిల్లీకి పోయి చేయాల్సింది ధర్నాలు కాదని, ఢిల్లీలో ప్రభుత్వాన్ని, పార్టీలను మెప్పించాలని చెప్పారు. మోదీని దించుతా, రాహుల్‌ను ప్రధాని చేస్త అని, బీఆర్ఎస్ను తిట్టడం కోసమే సీఎం, మంత్రులంతా ఢిళ్లీ వెళ్లారా అని ప్రశ్నించారు.