హైదరాబాద్, ఆగస్టు19 (నమస్తే తెలంగాణ): దేశాన్ని దీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీయే బీసీ వర్గాలకు తీరని ద్రోహం చేసిందని శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఇప్పటికే బీసీల చేతిలో కాంగ్రెస్ పార్టీ చావుదెబ్బ తిన్నదని, వచ్చేకాలంలో తెలంగాణలోనూ మళ్లీ కోలుకోకుండా ఆపార్టీ కుప్పకూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను వారిద్దరూ ఓ సంయుక్త ప్రకటనలో ఖండించారు. సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్రెడ్డి బీసీ రిజర్వేషన్ల చట్టంపై తన నోటికొచ్చినట్టుగా అసత్యాలు వల్లించారని దుయ్యబట్టారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల హామీ మోసం బట్టబయలు కావడంతో, దిక్కుతోచని స్థితిలో రేవంత్రెడ్డి దిగజారి, గత సర్కారుపై నిందలు వేయడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చట్ట, న్యాయపరంగా ఎన్నో ప్రయత్నాలు చేసిందని, చివరకు ప్రధాని నరేంద్రమోదీని సైతం కేసీఆర్ కలిసి, రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించింది సుప్రీంకోర్టు అయితే, పార్లమెంట్లో పరిమితిని ఎత్తివేసే చర్యలు చేపట్టకుండా దీర్ఘకాలం ద్రోహం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు అని తేల్చిచెప్పారు.
కనీసం తమిళనాడు తరహాలో, రిజర్వేషన్ల పెంపును 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారానో? లేదా, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల పెంపు హక్కు లు రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం ద్వారానో.. చేయాలని గతంలో కేసీఆర్ అనేకసార్లు ప్రధానిని డిమాండ్ చేసినట్టు పేర్కొన్నారు. కానీ, నాడు కాంగ్రెస్ ద్రోహం, బీజేపీ నేటి వంచన కలిసి, బీసీ రిజర్వేషన్ల పెంపునకు ప్రధాన అవరోధంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు.
గత బీఆర్ఎస్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు, ఆత్మగౌరవ సౌధాలు, గురుకులాలు ఇలా.. బీసీ వర్గాల అభ్యున్నతికి విశేష కృషి జరిగిందని మధుసూదనాచారి, జోగు రామన్న తెలిపారు. బడుగులకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచడం కోసం మార్కెట్ కమిటీలు, జడ్పీ చైర్మన్ల వంటి కీలక పదవుల్లో బీసీ వర్గాలకు కేసీఆర్ రిజర్వేషన్లు కల్పించినట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా.. కనీసం కామారెడ్డి డిక్లరేషన్లోని ఒక్క హామీని కూడా అమలు చేయలేక, చివరకు ఊరించిన 42శాతం రిజర్వేషన్ల పైనా.. చేతులెత్తేయడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్లో హంగామా, ఢిల్లీలో డ్రామా తప్ప కాంగ్రెస్ సర్కారు బీసీ రిజర్వేషన్ల అంశంలో సాధించిందేమీ లేదని దుయ్యబట్టారు. అన్నీ తెలిసే బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో కాంగ్రస్ దగా చేసిందని విమర్శించారు.