హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని మండలిలో విపక్ష నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి (Madhusudhana Chary) అన్నారు. కేటీఆర్ మీద పెట్టిన అక్రమ కేసు తీవ్రంగా నిరసన తెలుపుతున్నామని, దానిపై సభలో చర్చించాలని డిమాండ్ చేశామన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, కేటీఆర్ తన శక్తి మేరకు ప్రపంచ స్థాయి ఫార్ములా-ఈ రేస్ హైదరాబాద్ తెచ్చారని వెల్లడించారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు పెట్టేలా ఈ రేస్ చేపట్టారన్నారు. మొదటి రేసు విజయవంతమైందని, రెండో రేసుని ప్రభుత్వం ఆపేసిందని చెప్పారు.
హైదరాబాద్‌ను సర్వనాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. అందులో భాగంగానే కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. ఇప్పటికే కేటీఆర్
అన్ని వివరాలు చెప్పారని, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. చాలా పారదర్శకంగా చెల్లింపులు జరిగాయని వెల్లడించారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతునందుకే ఈ అక్రమ కేసు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో భయానక వాతావరణం కొనసాగుతున్నదని, అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బిడ్డలకు పోరాటాలు కొత్తకాదని చెప్పారు. ఎలాంటి కేసులైన ధైర్యంగా ఎదుర్కొంటారని స్పష్టం చేశారు.
కేటీఆర్ప పెట్టిన కేసు అక్రమమని మాజీ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ రేస్ తెచ్చారని తెలిపారు. అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. హైదరాబాద్ ఇమేజ్ మరింత పెంచేందుకు ఫార్ములా-ఈ రేస్ తెచ్చారని చెప్పారు. కేటీఆర్ మీద కేసులు పెట్టడం కాదని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రేవంత్ రెడ్డికి సూచించారు.
మండలిలో ప్రజాసమస్యలపై పోరాడుతున్నామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సమస్యలను పక్కనపెట్టిన ప్రభుత్వం బిల్లులు ఆమోదించుకుంటున్నదని విమర్శించారు. లగచర్ల రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టడం ప్రభుత్వ కుట్రలో భాగమన్నారు. లగచర్ల రైతులకు అండగా నిలిచినందుకే ఈ కేసులని, లంబాడీలు, గిరిజనులు ప్రభుత్వ కుట్రలను తిప్పికొడుతామన్నారు. రేవంత్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పాలన్నారు.