ఖమ్మం, జూన్ 28 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే నిధులు వెచ్చించి పనులు పూర్తిచేసిందని, ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ చెప్పారు. జిల్లా మంత్రులు మాత్రం ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. శుక్రవారం ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయం(తెలంగాణభవన్)లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడా రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6నెలలైనా కాకముందే ఆప్రాజెక్టును ఎలా పూర్తిచేశారని ప్రశ్నించా రు. ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో ఒక్క ప్రాజెక్టునైనా నిర్మించిందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాలో కేవలం తొమ్మిది నెలల్లోనే ‘భక్తరామదాసు’ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి పాలేరు నియోజకవర్గంలోని 72 వేల ఎకరాలకు సాగునీరు అందించిన విషయాన్ని జిల్లా రైతులు ఎప్పటికీ మర్చిపోరని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కోట్ల రూపాయలను కేటాయించి ‘సీతారామ’కు 2017లో శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో 1000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన మంత్రులు.. ఈ రోజు ప్రాజెక్టు ట్రయల్ రన్ ముందు గొప్పలు చెప్తున్నారని దుయ్యబట్టారు.