మధిర, జూలై 07: మధిర ఆర్టీసీ డిపో బస్ డ్రైవర్ (RTC Driver) మధిర ఏ. వెంకటేశ్వర్లు తన నిజాయితీని చాటుకున్నారు. మధిర డిపోకు చెందిన బస్సు టీఎస్04జెడ్0309 సూపర్ లెగ్జరీ హైదరాబాదులోని బీహెచ్ఈఎల్ (BHEL) నుంచి మధిరకు వస్తున్నది. ఈ క్రమంలో బోనకల్లు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన సీహెచ్ హనుమంతరావు హైదరాబాద్‌లోని జేఎన్టీయూ వద్ద బస్సు ఎక్కారు. బోనకల్లు ఎక్స్ రోడ్డు వరకు వెళ్తున్న ఆయన విలువైన వస్తువులు, డబ్బుతో కూడిన బ్యాగుతో ప్రయాణిస్తున్నారు. తన గమ్యస్థానం రావడంతో ఆ బ్యాగును కూర్చున్న సీట్లో మర్చిపోయి బస్సు దిగిపోయారు.
అయితే బస్సు మధిర డిపోకి వెళ్లిన తర్వాత ఆ బస్సులో బ్యాగ్ ఉండటాన్ని గమనించిన డ్రైవర్.. దానిని పరిశీలించారు. దీంతో అందులో రూ.2000 నగదు, బంగారపు నక్లేస్, బంగారపు చైన్, బంగారపు చెవి దిద్దులు, మొబైల్ ఫోన్ ఉన్నట్లు గుర్తించారు. కాగా, తన బ్యాగ్‌ని మర్చిపోయినట్లు గ్రహించిన బాధితుడు.. మధిర ఆర్టీసీ డిపో వద్దుకు చేరుకున్నారు. బ్యాగులో సుమారు రూ.10 లక్షల విలువ చేసే వస్తువులు ఉన్నాయని చెప్పారు. దీంతో దానిని ట్రాఫిక్ ఇన్చార్జ్ బీ. వెంకటేశ్వర్లు, మధిర బస్టాండ్ కంట్రోలర్ ఎస్కే. కాలేషా, సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో ప్రయాణికుడికి అప్పగించారు. పోయిన బ్యాగ్‌ని తిరిగి అందజేసిన డ్రైవర్ వెంకటేశ్వర్లు, డిపో అధికారులకు హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు.