కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 12: కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఐడీపీల్ సంస్థ భూములు, ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. తమ ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అక్రమాలు జరిగితే రుజువు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. ప్రభుత్వపరంగా జరిపే ఏ విచారణకైనా సహకారం అందిస్తానని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో రాజకీయంగా తనను ఎదుర్కోలేని కొందరు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఇటీవలి కాలంలో తనపై ఆరోపణలు చేస్తున్నరని తెలిపారు. కొన్ని మీడియా సంస్థల్లో వారికున్న పలుకుబడిని ఉపయోగించి తప్పుడు ఆరోపణలతో కథనాలు రాయిస్తున్నారని, రాజకీయంగా తన ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఓ మీడియా కథనంలో ఐడీపీఎల్‌కు చెందిన రూ.4,000 కోట్ల విలువచేసే భూము లు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపణలు చేశారని తెలిపారు. తనతోపాటు తన కుటుంబసభ్యులపై కొందరు రాజకీయ పార్టీల నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వపరంగా పూర్తిస్థాయిలో విచారణ జరపాలని విజ్ఞప్తిచేశారు.
ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని ఎమ్మెల్యే కృష్ణారావు పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామారం గ్రామంలోని సర్వే నంబర్ 307లో దాదాపు 317 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించి ప్రజాప్రయోజనాల కోసం వినియోగించాలని కోరారు. గాజులరామారంలోని సర్వే నంబర్ 307తో పాటు కూకట్పల్లి, బాలానగర్ మండలాల పరిధిలోని సీఎస్ 14, సీఎస్ 7 కేసులలో చిక్కుకున్న వందల ఎకరాల భూములపై కూడా పూర్తిస్థాయిలో సమీక్ష జరిపి, ప్రభుత్వపరంగా సమగ్ర విధానాలతో ముందుకు వెళ్లాలని కోరారు. ఆ భూముల్లో జరిగిన అవకతవకలను వెలుగులోకి తీసుకొచ్చి అక్రమాలకు పాల్పడినవారిపై కఠినచర్యలు తీసుకోవాలని అన్నారు.