Foxconn | హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): భిన్న సాంకేతికతలకు ప్రపంచ కేంద్రంగా అవతరించేందుకు జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతున్న తెలంగాణ రాష్ట్రం.. త్వరలో మరో ప్రతిష్ఠాత్మక ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ఉత్పత్తిని విశ్వ విపణిలోకి విడుదలచేయబోతున్నది. స్మార్ట్ఫోన్లు, వాటి పరికరాల ఉత్పత్తిలో వెనుకబడ్డామన్న లోటును దేశంలోని అత్యంత యువ రాష్ట్రం మరికొద్ది నెలల్లో పూడ్చుకోబోతున్నది. ఎలక్ట్రానిక్స్‌లో ‘భారతదేశ షెన్జెన్’గా అవతరించేందుకు ఉరుకులు పెడుతున్నది. తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ నిర్దేశిత లక్ష్యం ప్రకారం ఉత్పత్తి ప్రారంభించే దిశగా ముందుకు సాగుతున్నది. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో మే 15న పరిశ్రమ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. తొమ్మిది నెలల్లోగా ఉత్పత్తి చేపట్టాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా, 40 రోజుల్లోనే పునాది పనులు పూర్తయ్యాయి. త్వరలో గోడల నిర్మాణం చేపట్టేందుకు సమాయత్తమవుతున్నది.
రూ.4,114 కోట్ల పెట్టుబడి
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫాక్స్‌కాన్ సంస్థ, యాపిల్ ఐఫోన్ తయారీకి ఉపయోగపడే 70 శాతం విడిభాగాలను సరఫరా చేస్తున్నది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు కొంగరకలాన్‌లో ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. మొదటిదశలో రూ.1,656 కోట్లకుపైగా పెట్టుబడితో ఫాక్స్‌కాన్ ఇక్కడ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. దీనిద్వారా 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దశలవారీగా మొత్తం 500 (సుమారు రూ.4114కోట్లు) మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ఫాక్స్‌కాన్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది. కొంగరకలాన్ యూనిట్లో మొదట యాపిల్ ఇయర్‌బడ్స్ తయారుచేస్తారని సమాచారం.
తయారీ రంగంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న తెలంగాణ
ఫాక్స్‌కాన్ యూనిట్ ఏర్పాటు ద్వారా ప్రపంచ తయారీరంగ ముఖచిత్రంలో తెలంగాణ సుస్థిర స్థానాన్ని సంపాదించుకునేందుకు వీలు కలుగుతుందని చెప్పవచ్చు. చైనా నుంచి వైదొలిగి భారత్‌లో కార్యకలాపాలు విస్తరించాలన్న ఫాక్స్‌కాన్, యాపిల్ సంస్థల సంకల్పాన్ని గుర్తించిన పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు.. వెంటనే రంగంలోకి దిగారు. భారత్‌లో ఏర్పాటు చేయనున్న ఫాక్స్‌కాన్ పరిశ్రమను తెలంగాణకు రప్పించేలా కృషిచేశారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కంపెనీ ప్రతినిధిబృందానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించారు.
రానున్న పదేండ్లలో ఎలక్ట్రానిక్స్ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ పరిశ్రమను తన్నుకుపోయేందుకు అనేక రాష్ర్టాలు పోటీపడినప్పటికీ.. సీఎం కేసీఆర్ సాధికారత, మంత్రి కేటీఆర్ డైనమిజానికి ముచ్చటపడిన ఆ సంస్థ చైర్మన్ యంగ్‌లియూ.. తమ యూనిట్‌ను తెలంగాణలోనే నెలకొల్పుతామని స్ప ష్టంచేయడం విశేషం. సీఎం కేసీఆర్ పాలనా విధానాన్ని పొగుడుతూ ఆయన గతంలో లేఖ కూడా రాశారు. అభివృద్ధిలో తెలంగాణ ఎంత వేగంగానైతే పరుగులు పెడుతున్నదో.. ఫాక్స్‌కాన్ సంస్థ కూడా అంతే వేగంగా యూనిట్ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నదని మంత్రి కేటీఆర్ కొనియాడారు. యంగ్ లియూ చెప్పినట్టుగానే ‘తెలంగాణ స్పీడ్’ను అతని బృందం బాగానే అనుసరిస్తున్నదని పేర్కొన్నారు.