హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిశోర్ సూచించారు. ఫ్యాక్టరీల్లో భద్ర తా చర్యలను రూపొందించి, అమలు చేసి, ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. భద్రతా చర్యలపై చేసే చిన్న పెట్టుబడి కూడా విలువైన ప్రాణాలు కాపాడుతుందని సూచించారు. భద్రతా నిబంధనల అమల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆదేశించారు. నేషనల్ సేఫ్టీ కౌన్సిల్, తెలంగాణ చాప్టర్, కర్మాగారాల శాఖ సాంకేతిక సహకారంతో ‘పారిశ్రామిక ఎల్పీజీ, సీఎన్జీ భద్రతపై అవగాహన, ఉత్తమ పద్ధతులు’ అనే అంశంపై హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ సు రానా ఆడిటోరియంలో మంగళవారం ఒక రోజు వర్‌షాప్ నిర్వహించారు. దీనికి వివిధ పరిశ్రమల నుంచి 130 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
దానకిశోర్ మాట్లాడుతూ.. కర్మాగారాల్లో పనిచేసేవారు నైపుణ్య అభివృద్ధిని పెంచుకోవాలని సూచించారు. దేశీయ పారిశ్రామిక రంగాల్లో ఎల్పీజీని సురక్షితంగా నిర్వహించడం గురించి వివరించారు. పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులు కూడా పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీలు అనుసరించే ఉత్తమ పద్ధతులు పాటించాలని సూచించా రు.
సెప్టెంబర్‌లో భద్రతా నిపుణుల కోసం కర్మాగారాలశాఖ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కర్మాగారాల శాఖ డైరెక్టర్ వై మోహన్‌బాబు గుర్తుచేశారు. శిక్షణ పొందిన నిపుణులు గత రెండు నెలల్లో ప్రమాదకర కర్మాగారాల్లో పనిచేస్తున్న 35,000 మంది ఉద్యోగులకు భద్రతా ప్రమాణాలపై శిక్షణ ఇచ్చారని చెప్పారు. నేషనల్ సేఫ్టీ కౌన్సిల్, తెలంగాణ చాప్టర్ గౌరవ కార్యదర్శి వీవీ శశికుమార్ పాల్గొన్నారు.