Congress MP | హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ఎంపీల భోజన ఖర్చు అక్షరాలా రూ.13.59 లక్షలు. అంతేంటని అనుకోవద్దు& ఈ ఏడాది మార్చి 8వ తేదీన నిర్వహించిన మీటింగ్ ఖర్చుల కింద ప్రణాళిక శాఖ రూ.13,59,217 మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడమే అందుకు సాక్ష్యం. ఈ మేరకు తాజ్‌కృష్ణ హోటల్‌కు రూ.8,43,700. హోటల్ ది ప్లాజాకు రూ.1,95,800. ఎన్ఎం కంపెనీకి రూ.3,06,517. అంజలి ఫ్లోరిస్ట్‌కు రూ.6వేలు, సంతోష్ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.7,200 చొప్పున ఖర్చులకు మంజూరు చేసింది. ఇంతైతే ఈ సమావేశానికి 8 మంది కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ ఎంపీలు మొత్తంగా 10 మందే హాజరుకావడం విశేషం.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిరోజూ అప్పులు, అప్పులు.. అంటూ పేదరికపు అరుపులతోనే పొద్దెల్లదీస్తూ ఉంటారు. రాష్ట్ర పరిస్థితి మరీ అంత దయనీయంగా ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు.., ఖర్చులు తగ్గించుకుంటారు.., పైసాపైసా పోగేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చిన్నచిన్న మీటింగ్లకే లక్షల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ప్రజాసొమ్మును దుబారా చేస్తున్నది. ఈ ఏడాది మార్చిలో ప్రజాభవన్‌లో నిర్వహించిన ఎంపీల మీటింగే అందుకు సాక్ష్యం. మోదీ సర్కార్ వద్ద పెండింగ్ అంశాల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మార్చి 8వ తేదీన డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎంపీల మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో డిప్యుటీ సీఎం భట్టి 8 మంది కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ ఎంపీలకు మాత్రమే బ్రీఫింగ్ ఇవ్వగా ఖర్చు మాత్రం తడిసిమోపెడైంది.
కేంద్రం నుంచి నిధులు రాబట్టడం ఎజెండాగా డిప్యుటీ సీఎం ఎంపీలతో నిర్వహించిన సమావేశానికి భోజనాలు తాజ్‌కృష్ణ, ప్లాజా హోటళ్ల నుంచి తెప్పించారు. ఇందుకోసం తాజ్‌కృష్ణకు రూ.8.43 లక్షలు వెచ్చించగా, ప్లాజా హోటల్ నుంచి తెప్పించిన భోజనాలకు రూ.1.95 లక్షలు చెల్లించారు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, బయట రూపాయి కూడా అప్పు పుట్టడం లేదని, ఢిల్లీ వెళ్తే దొంగల్లా చూస్తున్నారంటూ బీద అరుపులు అరుస్తున్న ప్రభుత్వ పెద్దలు, సాదాసీదా సమావేశాలకు మాత్రం జనం సొమ్మును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు.
లక్షలు వెచ్చించి మీటింగ్ నిర్వహిస్తే సాధించింది మాత్రం శూన్యమే. రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ అంశాలపై భట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని, పెండింగ్ అంశా లు పరిష్కరించుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాలకు తపించిపోయే సర్కార్ పెద్దలు కేవలం ఎంపీలకు హితబోధ చేసేందుకు అంత భారీగా ఖర్చు చేయడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోనీ రూ.13.59 లక్షలు ఖర్చు చేసి నిర్వహించిన సమావేశం తర్వాత సర్కారు ఏమైనా సాధించిందా అంటే అదీలేదు. ఇలా ఏమీ సాధించని సమావేశానికి లక్షలు ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.