హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2025-2027 సంవత్సరానికి గాను మద్యం దుకాణాల లైసెన్స్‌ల ప్రక్రియ ముగిసింది. 2620 మద్యం దుకాణాలు ఉండగా, సోమవారం లాటరీ పద్ధతిలో 2601 దుకాణాలకు లైసెన్స్‌లు కేటాయించారు. 19 దుకాణాలకు నాలుగులోపు దరఖాస్తులు వచ్చాయని, అక్కడ సిండికేట్లు కూడబలుక్కొని ఉండవచ్చనే అనుమానంతో లాటరీ రద్దు చేసినట్టు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. వాటికి నేడు(మంగళవారం) మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు చెప్పారు. నవంబర్ 1 వరకు దరఖాస్తులు స్వీకరించి, నవంబర్ 3న లాటరీ ద్వారా లైసెన్స్ ఖరారు చేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది లక్కీ డిప్లో రాష్ట్ర వ్యాపారులకు చుక్కెదురైనట్టు తెలిసింది.
ఇతర రాష్ర్టాలకు చెందిన వ్యాపారులకే ఎక్కువ దుకాణాలు దక్కినట్టు వ్యాపారవర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారంలో పేరున్న శ్రీనివాస్ సిండికేట్ 100 దరఖాస్తులు దాఖలు చేయగా, వారికి 5 దుకాణాలు మాత్రమే వచ్చినట్టు తెలిసింది. సిద్దిపేటకు చెందిన ప్రసాద్‌బాబు టీమ్ 27 దుకాణాలకు దరఖాస్తులు చేసుకోగా.. వారికి ఒక్క లైసెన్స్ కూడా రాలేదని చెప్పారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లైసెన్స్‌లు నవంబర్ 30తో ముగిసి, డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్‌లు అమల్లోకి రానున్నాయి. కొత్త లైసెన్స్‌ల గడువు 2027 నవంబర్ 30తో ముగుస్తుంది. ఈ ఏడాది మద్యం షాపుల లైసెన్స్‌ల కోసం 95,137 దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2854 కోట్ల ఆదాయం సమకూరింది.