హైదరాబాద్, మార్చి 3( నమస్తే తెలంగాణ): పశువుల్లో లంపీ చర్మ వ్యాధి (ఎల్ఎస్డీ) నివారణకు అధికారులు తీసుకున్న చర్యలను వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్లు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పశువుల్లో ఉన్న ఎల్ఎస్డీ వ్యాధి నివారణకు చర్యలు తీసుకోకపోతే మనుషులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉన్నదంటూ గద్వాలకు చెందిన న్యాయవిద్యార్థి ఆర్ కంబయ్య రాసిన లేఖను హైకోర్టు పిటిషన్‌గా పరిగణించింది. గద్వాలకు పకనే ఉన్న ఏపీ రాష్ట్రంలో ఈ వ్యాధి ప్రబలంగా ఉన్నదని, అది తెలంగాణలోని పశువులకు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకునేలా ఉత్తర్వు ఇవ్వాలని లేఖలో కోరారు. ఈ వ్యాధి తీవ్రమైతే ఆవులు, ఎద్దుల సంతతి అంతరించిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గద్వాల జిల్లాలోని పలు గ్రామాల్లోని పశువులకు ఈ వ్యాధి వ్యాపించిందని, మరణించిన పశువులకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు పరిహారం ఇచ్చేలా ఉత్తర్వు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. విచారణను జూన్ 8కి వాయిదా వేసింది.