ఐదు రూట్లలో 10 రోజులపాటు నిర్వహణ
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ నుంచి బస్సుయాత్రలు ప్రారంభించనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. ‘విజయ సంకల్ప యాత్ర’ పేరుతో మార్చి 1 వరకు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఆదివారం యాత్ర పోస్టర్‌ను బీజేపీ రాష్ట్రకార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దేశ ప్రజల్లో స్పష్టమైన ఆలోచన కనబడుతున్నదని, మరోసారి బీజేపీ సరారు రావాలి.. మూడోసారి మోదీ ప్రధాని కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.
ప్రజల ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర శాఖ ఐదు రూట్లలో బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించిందని, ఈ యాత్ర ఐదు ప్రాంతాల్లో ప్రారంభమవుతుందని వివరించారు. ఈ యాత్ర రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మండలాల్లో కొనసాగుతుందని చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో రోడ్ షోలు ఉంటాయని వెల్లడించారు. ముగింపులో ఈ ఐదు యాత్రలు హైదరాబాద్‌లో కలుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాణి రుద్రమ తదితరులు పాల్గొన్నారు.
యాత్ర పేరు : పార్లమెంట్ నియోజకవర్గాలు
కుమ్రంభీం యాత్ర : ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్
శాతవాహన యాత్ర : కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల
కాకతీయ యాత్ర : ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్
భాగ్యనగర యాత్ర : భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మలాజిగిరి
కృష్ణమ్మ యాత్ర : మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ