హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత (Cold Weather) పెరగుతున్నది. సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం న్యాల్కల్లో 7.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. కోహిర్లో 9.2 డిగ్రీలు, గుమ్మడిదలలో 9.2, సత్వార్‌లో 9.3, మెదక్ జిల్లా శివ్వంపేటలో 8.9, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 10.9 డిగ్రీలు నమోదయింది. ఇక ఆదిలాబాద్‌లో 9.7 డిగ్రీలు, పటాన్చెరులో 12.2, హనుమకొండలో 13.5, రామగుండంలో 13.8, నిజామాబాద్‌లో 14.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
కాగా, రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదు కావడం చలి తీవ్రతకు అద్దంపడుతున్నది. ఉదయం 8 దాటినా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. చలిమంటలు వేసుకుని కాచుకుంటున్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా భీమ్‌పూర్-టీలో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన విషయం తెలిసిందే. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో 8.8 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 9.4 డిగ్రీలు, మెదక్ జిల్లా శివ్వంపేటలో 9.5 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 10 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా జుక్కల్‌లో 10.4 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా కోట్గిరిలో 10.4, కొండపాకలో 10.6 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 10.7 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మరిపల్లిలో 10.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.