హైదరాబాద్, నవంబర్ 13( నమస్తే తెలంగాణ): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వెంట కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో పగటి పూట వాతావరణం పొడిగా ఉంటున్నదని, సాయంత్రానికి చల్లబడి పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. హైదరాబాద్లోని వాతావరణంలో స్వల్ప మార్పులు ఉంటాయని వివరించారు. వర్ష సూచనతో వరి కోతలు, వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు అధికారులు సూచించారు.
తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయి, కొన్ని చోట్ల 15 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో 14 డిగ్రీలు రికార్డయింది. చలితీవ్రత పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో గరిష్ఠంగా ఖమ్మంలో 34డిగ్రీలు, నిజామాబాద్లో 33.4డిగ్రీలు నమోదైంది.