హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): రానున్న ఐదురోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం కర్ణాటక అంతర్భాగం వరకు సముద్ర మట్టానికి 0.9కి.మీ ఎత్తులో కొనసాగుతుందని, ఎత్తుకు పోయేకొద్ది స్వల్పంగా నైరుతి వైపు వంగి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారి 24నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల చివరి వరకు తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున మరికొన్ని ప్రాంతాలకూ విస్తరించే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి సునంద వెల్లడించారు. కాగా, ఒడిశా, పశ్చిమబెంగాల్ మధ్య తుఫాన్ తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీలను జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ చేసింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పుకొచ్చింది.
జూన్ రెండోవారంలో రుతుపవనాల విస్తరణ
నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 5 నుంచి 11వ తేదీల మధ్య రాష్ట్రాన్ని తాకనున్నట్టు అంచనా వేసింది. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. అకడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ మీదుగా తెలంగాణకు చేరుకుంటాయి. ఇందుకు కనీసం అయిదారు రోజుల సమయం పడుతుంది. ఆ ప్రకారంగా చూస్తే జూన్ 5 నుంచి 8 తేదీల మధ్య రుతుపవనాలు వచ్చే అవకాశాలు ఎకువగా ఉన్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. జూన్ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ నిపుణులు సూచిస్తున్నారు.