Telangana | హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): తూర్పు, మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్ గోవా తీర ప్రాంత సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ, రాగల 36గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని వివరించారు. ఈనెల 27న ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. అలాగే గంటకు 50నుంచి 60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. శుక్ర, శనివారాల్లో కొన్ని జిల్లాల్లో అకడకడ భారీ వర్షాలు కురవనుండటంతో, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసినట్టు తెలిపారు. నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు.
గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసినట్టు కే నాగరత్న తెలిపారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో అత్యధికంగా 11.69 సెం.మీ, చేగుంటలో 8.92 సెం.మీ, కుల్చారంలో 8.68 సెం.మీ, వెల్దుర్తిలో 8.36 సెం.మీ, మనోహరాబాద్‌లో 6.87 సెం.మీ, సూర్యాపేట జిల్లా కోదాడలో 8.42 సెం.మీ, చిలుకూరులో 6.79 సెం.మీ, మేళ్లచెర్వులో 7.68 సెం.మీ, నిజామాబాద్ జిల్లా మెండోరాలో 8.17 సెం.మీ, ముప్కాల్‌లో 6.73 సెం.మీ, బాల్కొండ 6.68 సెం.మీ, సిద్దిపేట జిల్లా దౌలతాబాద్‌లో 7.76 సెం.మీ, వర్గల్లో 6.86 సెం.మీ, తొగుట 6.84 సెం.మీ, కామారెడ్డి జిల్లా నాగారెడ్డిపేటలో 7.70 సెం.మీ, నస్రుల్లాబాద్‌లో 7.20 సెం.మీ, వర్షపాతం నమోదైనట్టు వివరించారు.