హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పడుతున్నది. ఎగువన వర్షాలు ఆగిపోవడంతో వరద తగ్గుతున్నది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీకి 16,71,388 క్యూసెక్కుల నీరు వస్తున్నది. అయితే అధికారులు ప్రాజెక్టు మొత్తం 85 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక సరస్వతి (అన్నారం) బ్యారేజీకి 2,41,891 క్యూసెక్కుల వరద వస్తుండగా, 66 గేట్లు ఎత్తి మొత్తం నీటిని కిందికి వదులుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద తగ్గుతున్నది. దీంతో అధికారులు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం 47,215 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 40,984 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1087.90 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. శ్రీరాంసాగర్ గరిష్ట నీటినిల్వ 90.30 టీఎంసీలు కాగా, ఇప్పుడు 76.10 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.