Peddapalli | పెద్దపల్లి, ఫిబ్రవరి 15 : ఆర్టీవో అధికారుల నుంచి లంచాల వేధింపులు తాళలేక శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం ఆవరణలో బసంత్‌నగర్‌కు చెందిన లారీ ఓనర్ అనిల్ కుమార్‌గౌడ్ లారీ ఎక్కి విద్యుత్ తీగలను తాకి అత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. మామూళ్లు ఇవ్వనందుకు తన లారీపై పదేపదే కేసులు పేడుతున్నారని, ఒకో లారీకి నెలకు రూ.8 వేల చొప్పున లంచం వసూలు చేస్తున్నట్టు ఆరోపించారు.
న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించనని చావనైనా చస్తాకానీ లంచం ఇవ్వనని స్పష్టంచేశాడు. ఆర్టీవో అధికారులు పోలీసులు, విద్యుత్తు అధికారులకు సమాచారం ఇవ్వగా వారు విద్యుత్తు సరఫరా నిలిపేశారు. పెద్దపల్లి పోలీసులు, ఆర్టీవో రంగారావు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు.
అనిల్‌కుమార్‌గౌడ్ తన లారీకి సంబంధించిన ట్యాక్స్ కట్టలేదని 7 నెలల క్రితం లారీని సీజ్ చేసి జరిమానా విధించారు. అప్పటి నుంచి ఆర్టీవో కార్యాలయంలో లారీ ఉంది. ఇటీవల అనిల్ కుమార్‌గౌడ్‌ను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చినం. ట్యాక్స్ కట్టాలని చెప్పగా ఒప్పుకున్న అనిల్‌కుమార్ శనివారం లారీ ఎక్కి విద్యుత్ తీగలను తాకే ప్రయత్నం చేశాడు. నచ్చజెప్పి కిందికి దింపించాం. మళ్లీ కౌన్సెలింగ్ ఇవ్వగా ట్యాక్స్, జరినామా చెల్లించాడు.
– రంగారావు, పెద్దపల్లి ఆర్టీవో