మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, మార్చి 15 : ఈసారి భక్తుల సమక్షంలోనే భద్రాద్రి సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా నిరాడంబరంగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి, ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమాలను కరోనా తగ్గుముఖం పట్టినందున ఈసారి భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 10న కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి ఇచ్చినట్టు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కల్యాణం నిర్వహించే మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు.