భద్రాచలం/ ఖమ్మం(నమస్తే తెలంగాణ ప్రతినిధి), మార్చి 27: దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణం వై భవోపేతంగా సాగింది. శుక్రవారం ఉద యం 10:42 గంటలకు ప్రారంభమైన కల్యాణ క్రతువు మధ్యాహ్నం 12:45 వ రకు కొనసాగింది. సీతారాముల కల్యాణ మహోత్సవ విశిష్టతను, భద్రాద్రి ఆలయ క్షేత్ర ప్రాశస్త్యాన్ని, భక్తరామదాసు సేవల ను, భక్తితో సీతారాములకు ఆయన చే యించిన బంగారు ఆభరణాల చరిత్రను వేదపండితులు భక్తులకు వివరించారు. శ్రీరామచంద్రుడు, సీతమ్మవారికి సీఎం రేవంత్ దంపతులు పట్టువస్ర్తాలు, ము త్యాల తలంబ్రాలు సమర్పించారు.

దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, చినజీయర్ స్వామి, భక్త రామదాసు వారసుడు కంచ ర్ల శ్రీనివాసరావు, తూము నరసింహదాసు వంశీయులు సైతం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, డీజీపీ శివధర్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, ఈవో దామోదరావు కల్యాణంలో పాల్గొన్నారు.
కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మిథిలాస్టేడియంలో శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవాన్ని శనివారం ఉద యం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నారు. పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ శివప్రతాప్శుక్లా హాజరై.. స్వామివారికి పట్టువస్ర్తా లు సమర్పిస్తారు. భద్రాచలంలో రామాలయ అభివృద్ధి పనుల కోసం మిథిలా స్టేడియం సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకానికి సీఎం రేవంత్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. తొలి విడతగా కేటాయించిన రూ.351 కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించారు.
భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈవోనే ఆలయం ప్రవేశం వద్ద పోలీసులు నిలిపివేశారు. దేవస్థానం సిబ్బంది కలుగజేసుకొని ‘ఈవోనే ఆపుతారా..’ అని ప్రశ్నించడంతో పంపించారు. మిథిలా స్టేడియం వద్ద ఖమ్మం జిల్లాకు చెందిన ఓ న్యాయమూర్తిని పోలీసులు నిలిపివేశారు. అధికారులు వచ్చి మాట్లాడటంతో అనుమతించారు. భక్తరామదాసు వారసుడు కంచర్ల శ్రీనివాసరావును సైతం అడ్డగించి, అనంతరం పంపించారు. పోలీసు కుటుంబాలకు సంబంధించిన వారిని మాత్రం నేరుగా గ్యాలరీల్లోకి పంపించారు. కొందరు పోలీసు కుటుంబాలను నేరుగా పంపడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలొస్తున్నాయి.