హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏతో ప్రజల ఆస్తులను నిలువునా దోపిడీ చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూములు అమ్మకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని, ప్రజాపాలన అని చెప్పి, కాంగ్రెస్ సర్కార్ ప్రజా పీడన చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి కోట్ల రూపాయలు కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపుతున్నారని ఆరోపించారు.
తెలంగాణను ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలా మార్చేశారని, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో భూములు అమ్మి డబ్బులు పంపుతున్నారని పేర్కొన్నారు. ప్రజాపాలనలో ధర్నా చేసేందుకు సిద్ధపడితే హౌస్ అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రైవేట్ భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు కాంగ్రెస్ నాయకులు 30 శాతం కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.
నిషేధిత జాబితా పేరిట జరుగుతున్న దందాపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మానవ హక్కులను సర్కార్ కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.