BC Reservations | హైదరాబాద్, మార్చి 23 ( నమస్తే తెలంగాణ ) : బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి చూస్తుంటే, కాశెగడ్డి కావడి గుర్తుకొస్తున్నది. కావడి ద్వారా బరువు మోస్తున్న తండ్రిని చిన్నపిల్లలు, కాశెగడ్డితో తయారుచేసిన కావడితో నీళ్లు మోస్తున్నట్టుగా నటిస్తారు. ఆ కావడితో, పిల్లలు చేసే పనితో ఎలాంటి ప్రయోజనం ఉండబోదు. తండ్రి భారం ఏమాత్రం దిగిపోదు. కాంగ్రెస్ సర్కారు తీరు కూడా అలాగే ఉన్నదని బీసీ మేధావులు ఎద్దేవా చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంటింటి సర్వే మొదలు కమిషన్ల నియామకం, నివేదికలు, ప్రస్తుతం చట్టం రూపకల్పన తీరును చూస్తే ఇలాంటి అభిప్రాయమే కలుగుతున్నదని చెప్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా పాతరేసిందని, అనేక న్యాయపరమైన సవాళ్లు ఎదరవడమే కాకుండా, తుదకు చట్టమే చెల్లుబాటు కాని దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ, ఇంటింటి సర్వేపై రేవంత్ సర్కారు ఆదినుంచీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది. పేరుకు ఇంటింటి సర్వే అని చెప్పినా రాష్ట్రవ్యాప్తంగా జనాభాగణననే నిర్వహించింది. గణాంకాల సేకరణ చట్టం-2008 ప్రకారం సర్వే నిర్వహించాలంటే కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రిజిస్ట్రార్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం-1952 ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన కమిషన్‌ను, గణాంకాల సేకరణకు నోడల్ డిపార్ట్మెంట్ను, నోడల్ ఆఫీసర్‌ను, కమిషన్‌కు సెక్రటరీని నియమించాల్సి ఉంటుంది. నేషనల్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ డిపార్ట్మెంట్, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఎస్ఎస్వో తదితర విభాగాల నుంచి రాష్ర్టానికి చెందిన తాజా ఇండ్ల జాబితాను, బ్లాక్‌ల వారీగా రూపొందించిన హౌసింగ్ మ్యాపులను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సర్వే ప్రశ్నావళి రూపకల్పనకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. సేకరించిన డాటాను అందుబాటులో ఉన్న ప్రామాణికమైన ఓటర్ జాబితా, ఆధార్ జాబితా, రేషన్‌కార్డులు తదితర వాటితో విశ్లేషించాలి. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలకు సంబంధించిన స్థితిగతులపై తులనాత్మక అధ్యాయనం చేయాలి.
తుదకు అన్నింటినీ క్రోడీకరించి, విశ్లేషించి తుది నివేదికను రూపొందించాలి. దీనికి క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఆ గణాంకాలను ప్రామాణికంగా పరిగణనలోకి తీసుకునే అవకాశముంటుందని న్యాయకోవిదులు, నిపుణులు, బీసీ మేధావులు చెప్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం సర్వే బాధ్యతలను ప్రత్యేక కమిషన్‌కు కాకుండా, ప్లానింగ్ డిపార్ట్మెంట్కు అప్పగించింది. ఈ మేరకు జీవో-18ని విడుదల చేసిన ప్రభుత్వం అందులో స్పష్టమైన వివరాలు పేర్కొనలేదు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వే (సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కులాల వారీగా) అని మాత్రమే పేర్కొన్నది. ఎందుకోసం చేస్తున్నారో పేర్కొనలేదు. క్యాబినెట్, ఆపై అసెంబ్లీలో చేసిన తీర్మానాలను మాత్రమే రెఫరెన్స్‌గా ఇచ్చింది. కానీ, సమగ్ర ఇంటింటి సర్వే కోసం బీసీ సంక్షేమ శాఖ మార్చి నెలలో జారీచేసిన జీవో-26ను ఎక్కడా రెఫర్ చేయలేదు. బీసీ కమిషన్‌కు టీవోఆర్లను నిర్దేశిస్తూ జీవోలు విడుదల చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా, బీసీ కమిషన్‌కే బీసీ రాజకీయ రిజర్వేషన్ల స్థిరీకరణ బాధ్యతలను అప్పగించింది. ఆ తరువాత హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చి, అక్షింతలు వేశాకే, నిబంధనల మేరకు డెడికేటెడ్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇదంతా ప్రభుత్వం చిత్తశుద్ధి లేమికి నిదర్శనమని బీసీ మేధావులు ఆరోపిస్తున్నారు.
కచ్చితమైన లెక్కలు తీయాలంటే తులనాత్మక అధ్యాయనం చేయాలి. అప్పటికే అందుబాటులో ఉన్న గణాంకాలు, కుటుంబాల సమాచారాన్ని క్షేత్రస్థాయిలో క్రాస్‌చెక్ చేసుకుంటూ, వాస్తవమేనని నిర్ధారించుకుంటూ, అదే సమయంలో కొత్త కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేస్తుంటారు. సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. అప్పుడే ఆ డాటాకు కచ్చితత్వంతోపాటు ప్రామాణికత ఉంటుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను అందుకు విరుద్ధంగా నిర్వహించింది. ఎన్యూమరేటర్లకు జనాభా సమాచారాన్ని, సర్వే చేపట్టాల్సిన ఇండ్ల వివరాలను అందజేయలేదు. సర్వే పత్రాలను మాత్రమే ఇచ్చింది. ఎన్యూమరేటర్లే ఇంటింటింకీ వెళ్లి ఆయా కుటుంబసభ్యులు చెప్పిన కులం, వృత్తి, ఆస్తులు, ఆదాయ వివరాలను నమోదు చేసుకున్నారు. ఆ వివరాలు సరైనవా? కాదా? అనేది క్షేత్రస్థాయిలోనే కాదు పైస్థాయిలోనూ తెలుసుకున్న దాఖలాల్లేవు. పూర్తిగా గృహ యజమానులు ఇచ్చే సమాచారం మీదనే ఆధారపడి వివరాలు సేకరించారు. ఆ తరువాత ప్రభుత్వం సర్వే నివేదికను ప్రకటించింది.
రాష్ట్రంలో మొత్తం జనాభా 3.7 కోట్ల మంది కాగా, వారిలో 16 లక్షల మంది (3.1%) సర్వేలో పాల్గొనలేదని, మిగతా 3.54 కోట్ల మంది వివరాలను సేకరించినట్టు నివేదించింది. అందులో బీసీలు 46.25%, ముస్లిం బీసీలు 10.08%, ఓసీలు 15.79%, ఎస్టీలు 10.45% ఉన్నట్టు నిర్ధారించింది. కానీ పట్టణ జనాభా, గ్రామీణ జనాభా, వృద్ధులు, యువకులు, విద్యార్థులు, దివ్యాంగులు.. ఇలా క్యాటగిరీల వారీగా వివరాలను స్థూలంగానైనా ప్రకటించలేదు. జిల్లాల వారీగా కూడా గణాంకాలను వెల్లడించలేదు. కేవలం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గణాంకాలే వెల్లడించి, అసెంబ్లీలో తీర్మానం చేసింది. సర్వే గణాంకాలన్నీ అసంబద్ధంగా ఉన్నాయని, సాధికారత లేకుండా పోయిందని బీసీ మేధావులు, సామాజికవేత్తలు ఆరోపించారు. విమర్శలు రావడంతో ప్రభుత్వం రీసర్వే నిర్వహించి, మరో 21 వేల కుటుంబాల వివరాలు సేకరించింది. ఇప్పటికీ కులాలు, ఉపకులాల వారీగా జనాభా లెక్కలను ప్రకటించలేదు. కేవలం స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ వర్గాల గణాంకాలనే బయటపెట్టింది.
స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు లేవు. ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకారం మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం బీసీ రిజర్వేషన్లు కలిస్తూ వస్తున్నాయి. దీనిని పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 2010లో కీలకమైన తీర్పు ఇచ్చింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు అర్టికల్-340 ద్వారా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని, ఆ కమిషన్ మాత్రమే ఆయా వర్గాల రాజకీయ వెనుకబాటుతనాన్ని గ్రామస్థాయిలో, శాస్త్రీయపద్ధతిలో స్వతంత్రంగా అధ్యయనం చేయాలని, ఆపై మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ సిఫారసులు చేయాలని నిర్దేశించింది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు లేకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీలకు రిజర్వేషన్లను కల్పించవద్దని తేల్చిచెప్పింది.
ట్రిపుల్టీ పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ప్రభుత్వం తొలుత డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయకుండానే సర్వేకు సన్నాహాలు చేసింది. దీంతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు అక్షింతలు వేసిన అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం బూసాని వెంకటేశ్వరరావు చైర్మన్‌గా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ప్రభుత్వం కులగణన వివరాలను ఫిబ్రవరి 4న అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. ఆ నివేదికను డెడికేటెడ్ కమిషన్‌కు ప్రభుత్వం అందజేయడం, రోజుల వ్యవధిలోనే కమిషన్ సైతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను స్థిరీకరించడం జరిగిపోయింది. ఆ నివేదికను డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి సమర్పించారు. డెడికేటెడ్ కమిషన్ బీసీలకు ఏ మేరకు రిజర్వేషన్లను ఖరారు చేసిందో బహిర్గతం చేయలేదు. కమిషన్ నివేదిక సమర్పణ తరువాత ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ప్రభుత్వం రీసర్వే చేపట్టింది. అనంతరం క్రోడీకరణ గణాంకాలను కమిషన్‌కు అందించిందా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు.
బీసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా చేసిన చట్టం సైతం లోపభూయిష్టంగానే ఉన్నదని బీసీ మేధావులు, న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. జాతీయస్థాయిలో 1993లో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ చట్టం చేశారు. ఆ చట్టాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు యథాతథంగా అమలు చేసేందుకు చట్టాలను రూపొందించుకున్నాయి. రాష్ట్రస్థాయిలో రాష్ట్ర బీసీ కమిషన్లను ఏర్పాటు చేసుకున్నాయి. బీసీ కమిషన్లు చేయాల్సిన విధుల్లో ముఖ్యమైనవి.. ఓబీసీ వర్గాల రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేయడం. మండల్ కమిషన్ సిఫారసుల మేరకు బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో అమలు చేస్తున్న 27% రిజర్వేషన్లను పర్యవేక్షించడం, సమీక్షించడం.
బీసీ కులాల జాబితాల్లో, గ్రూపుల్లో ఒక కులాన్ని చేర్చడం, లేదంటే తొలగించడానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు సిఫారసులు చేయడం. కానీ, బీసీ కమిషన్ నివేదిక లేకుండానే బీసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడం కొసమెరుపు. విద్య, ఉపాధి, ఉద్యోగ రిజర్వేషన్ల కల్పనకు డెడికేటెడ్ కమిషన్ అధ్యయనం చేసి సిఫారసులు చేసేందుకు అధికారాలు లేవు. ప్రభుత్వం ఆ మేరకు డెడికేటెడ్ కమిషన్‌కు మార్గదర్శకాలు జారీ చేయకపోవడం గమనార్హం. అయినప్పటికీ, డెడికేటెడ్ కమిషన్ నివేదికనే ప్రామాణికంగా తీసుకుని చట్టాన్ని రూపొందించడం ప్రభుత్వ చిత్తశుద్ధిలేమికి దర్పణం పడుతున్నది. ప్రభుత్వ విధానాలతో మొత్తం గందగోళంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు, జారీచేసిన మార్గదర్శకాలు, ఉత్తర్వులతో బీసీ రిజర్వేషన్ల చట్టాలకు న్యాయచిక్కులు తప్పవని బీసీ మేధావివర్గాలు, న్యాయకోవిదులు హెచ్చరిస్తున్నారు. సుప్రీంకోర్టు గతంలో విధించిన 50% కోటా పరిమితి సంగతేమో కానీ, సర్వే గణాంకాలే ప్రామాణికత లేకుండా పోయాయని వివరిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్‌టెస్ట్ మార్గదర్శకాలకు విరుద్ధంగా డెడికేటెడ్ కమిషన్‌ను కాదని, డాటా సేకరణ బాధ్యతలను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు అప్పగించింది. సుప్రీంకోర్టు అడ్డుచెప్పడంతో మళ్లీ కమిషన్ ద్వారానే చేయించింది. కమిషన్లు కాకుండా ప్రభుత్వం సేకరించే డాటాకు సాధికారత ఉండబోదని, ప్రస్తుత సర్వే గణాంకాలు కూడా అటకెక్కే పరిస్థితి ఉన్నదని న్యాయనిపుణులు, బీసీ మేధావులు చెప్తున్నారు. న్యాయసమీక్ష ఎదుట నిలబడే అవకాశమే లేదని అంటున్నారు. మొత్తంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితి నెలకొన్నదని స్పష్టంచేస్తున్నారు. ఇవన్నీ తెలిసినా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లోపభూయిష్టంగా, అశాస్త్రీయ పద్ధతిలో బీసీ రిజర్వేషన్ల చట్టం చేసిందని బీసీ మేధావులు విమర్శిస్తున్నారు. చట్టం చేసి చేతులు దులుపుకోవాలనే ఆసక్తే తప్ప మరేమీ కాదని మండిపడుతున్నారు.