Lok Sabha Elections | హైదరాబాద్ : రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగింది. పలు పోలింగ్ కేంద్రాల్లో 6 గంటలలోపు నిల్చున్న ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. 17 లోక్సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది. 65 శాతం దాకా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు కూడా పోలింగ్ ప్రక్రియ ముగిసింది.
తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. మిగిలిన 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కొనసాగనుంది.
మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని సమస్యాత్మకమైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది.