హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): లోక్ అదాలత్ అనేది కొత్త విధానమేమీ కాదని గతంలో అమలైన విధానమేనని, ఇందులో రాజీ ద్వారా వివాదాలు పరిషారం అవుతాయని హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్ చెప్పారు. కోర్టుల్లో అయితే ఒక పక్షమే గెలుస్తుందని, ఓడిన పక్షం పైకోర్టుకు అప్పీలుకు వెళ్తుందని తెలిపారు. ఈ విధానానికి భిన్నంగా ప్రారంభమైనదే లోక్ అదాలత్ అని, ఇందులో కేసులను రాజీ చేసుకోవడం ద్వారా ఇరుపక్షాలు విజేతలుగా నిలుస్తాయని వివరించారు. రాష్ట్రవ్యాప్త లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం ఆయన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎస్ శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 12.48 లక్షల కేసుల పరిషారం
శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జరిగిన లోక్ అదాలత్‌లో 12.48 లక్షల కేసులు పరిషారమైనట్టు రాష్ట్ర న్యాయసేవాధికార సభ్యకార్యదర్శి సీహెచ్ పంచాక్షరి వెల్లడించారు. వాటిలో 7.85 లక్షల పెండింగ్ కేసులతోపాటు 4.63 లక్షల ప్రీలిటిగేషన్ కేసులు ఉన్నాయని, ఈ కేసుల రాజీతో కక్షిదారులకు రూ.935 కోట్ల పరిష్కారం లభించనున్నదని తెలిపారు.
హైకోర్టులో 120 కేసుల పరిషారం
లోక్ అదాలత్‌లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ జీ శ్రీదేవి ధర్మాసనం 120 కేసులను పరిషరించింది. ఇందులో 84 వాహన ప్రమాద కేసులు ఉన్నాయని, ఆ కక్షిదారులకు రూ.9 కోట్లను పరిహారంగా ప్రకటించారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శిఎం శాంతివర్ధని తెలిపారు.