BRS Public Meeting | (మహారాష్ట్ర లోహా నుంచి నమస్తే ప్రత్యేక బృందం): మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని లోహా పట్టణం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాల్గొనే ఈ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. లోహా పట్టణంలోని బైల్ బజార్లో 15 ఎకరాల విస్తీర్ణంలో సభాప్రాంగణం ముస్తాబైంది. స్టేజీతోపాటు దాదాపు 50 వేల నుంచి 70 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కుర్చీలు, డేరాలతోపాటు వేసవి నేపథ్యంలో సభికుల కోసం కూలర్లను సైతం అమర్చారు. బహిరంగ సభ నేపథ్యంలో కంధార్, లోహా పట్టణాలు గులాబీమయమయ్యాయి. ప్రధాన రహదారులను గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులతో సుందరంగా తీర్చిదిద్దారు. సభ ఏర్పాట్లను బోధన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు షకీల్, జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్‌రావు కదం, కంధార్ మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే, కన్నాడ్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రీన్ఇండియా చాలెంజ్ కో కన్వీనర్ రాఘవ తదితరులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు.. పల్లెలు, తండాలన్నీ కలియ తిరుగుతున్నారు. పర్భణి, లాతూర్, నాందేడ్ లోక్‌సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా కంధార్, లోహా, కన్నాడ్, పర్భణి, డెగులూర్, పూర్ణా, గంగాఖేడ్, ముద్ఖేడ్, పత్రి, పాలా, చండోలి, చౌక్, మన్వర్, అహ్మదాపూర్, ధర్మాబాద్, బిలోలితోపాటు ఇతర నియోజకవర్గాలు, తాలూకాలపై దృష్టి సారించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను డిజిటల్ ప్రచార రథాల ద్వారా జోరు గా ప్రచారం చేస్తున్నారు. ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, కల్యాణలక్ష్మి, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర పథకాల విశిష్ఠతలను మరాఠీలో వివరిస్తున్నారు. గడచిన తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణలో వచ్చిన సామాజిక, ఆర్థిక మార్పులకు, మారిన వైద్యశాలలు, పాఠశాలలు, సాధించిన ప్రగతి చిహ్నాలైన కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులను వీడియోల ద్వారా ప్రజలకు చూపుతున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
(రేపు కేసీఆర్ వస్తున్నారు) లోహా, కంధార్ పట్టణంతోపాటు చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పైనే చర్చ జరుగుతున్నది. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మరాఠా ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేసీఆర్ వస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ గురించి వినడం, టీవీల్లో చూస్తూ మురిసిపోయేవారమని, ఇప్పుడు ఆయన స్వయంగా వస్తుండటం ఆనందంగా ఉన్నదని మరాఠీ రైతులు సంబురపడుతున్నారు. దేశంలో రైతుల సమస్యలను అర్థం చేసుకొని, వాటి పరిష్కారానికి కావాల్సిన చర్యలు చేపట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ అంటూ వేనోళ్లతో కీర్తిస్తున్నారు. గతంలో కాంగ్రెస్, బీజేపీ, శివసేననే కాకుండా మరే పార్టీ కూడా ఈ స్థాయిలో సభను నిర్వహించలేదని, 5 వేల మంది మించితేనే మహా గొప్పని.. కానీ, ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడంపై ఆశ్చర్యపోతున్నారు.
Kandhar Loya1
సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకొంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాఫ్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు లోహా పట్టణ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. లోహాలోని ఓ బీఆర్ఎస్ అభిమాని ఇంట్లో తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో బయలుదేరి నేరుగా పట్టణంలోని బైల్ బజార్ సభాప్రాంగణానికి చేరుకుంటారు. తొలుత మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గేతోపాటు కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మానిక్‌రావు కదం, హర్షవర్ధన్ జాధవ్, సురేశ్ గైక్వాడ్, యశ్పాల్ బింగే, నాగ్నాథ్ గిస్సేవాడ్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే మనోహర్ పట్వారీ, ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడు దగ్దా పవార్, ఛత్రపతి శివాజీ మరాఠా నవయువక్ మండల్ ప్రెసిడెంట్ మదన్ జాధవ్, స్పోర్ట్స్ కన్వీనర్ దిలీప్ కుమార్ జగ్టప్, సతీశ్ నల్గే, సతీశ్ షిండే, ప్రహ్లాద్ రాకోండే, వార్దా మాజీ ఎమ్మెల్యే వసంతరావు బోండే, ఎన్సీపీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ శివరాజ్ దోండ్గే, లక్ష్మణ్‌రావు వోంగేతోపాటు నాందేడ్‌కు చెందిన బీఆర్ఎస్ నేతల నేతృత్వంలో పలువురు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, బీజేపీ తదితర పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, సీనియర్ రాజకీయ నేతలు పార్టీలో చేరనున్నారు. వారికి సీఎం కేసీఆర్ గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తారు.
కంధార్లోని దర్గాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 1500 మంది ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఆర్మూర్, బోధన్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్, లోహా మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే, కన్నాడ్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాధవ్ తదితరులు ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సభకు జరుగుతున్న ఏర్పాట్లు నేను ఎప్పుడూ చూడలేదు. గతంలో ఎన్నికలప్పుడు ఎంతోమంది నాయకుల సభలు జరిగాయి. ప్రధాని మోదీ సభకూ ఇలాంటి ఏర్పాట్లు జరగలేదు. చుట్టుపక్కన గ్రామాల్లో జరుగుతున్న చర్చను విని.. నేను 10 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చాను.
-రుషికేశ్, యువ పట్టభద్రుడు
ఇక్కడ ఉన్న ప్రభుత్వ పథకాలు మాకు అందటం లేదు. కనీసం రేషన్ గోధుమలు కూడా ప్రతి నెలా ఇయ్యరు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. రేషన్ సరకులు కూడా సమయానికి లభించే వ్యవస్థ లేదు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.
-రహమాన్ ఖురేషీ, వ్యాపారి
మా ప్రాంతంతో రోడ్లు ఎంతో అధ్వాన్నంగా ఉన్నాయి. కంధార్-లోహాను కలిపే రహదారి కూడా సింగిల్ రోడ్డు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వివిధ గ్రామాలను కలిపే జిల్లా పరిషత్తు రోడ్లు, లింకు రోడ్లు కూడా గుంతల మయమే. పారిశుద్ధ్యం కూడా అంతంతే.
-రామోబా బలిరాం, లోహా గ్రామస్థుడు