హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్ అడ్మిషన్లో జీవో నంబర్ 33కు గత నెల 19న చేసిన అటాచ్ సవరణతో స్థానికత కోల్పోతున్న తెలంగాణ విద్యార్థులకు తగు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు వారు సోమవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రికి లేఖ రాశారు. కొన్నేండ్లుగా అమలవుతున్న నిబంధనల ప్రకారం 6 నుంచి 12వ తరగతి చదివిన ఏడేండ్ల కాలంలో గరిష్ఠంగా 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణించేవారని, కానీ జీవో నంబర్ 33కు అటాచ్ చేసిన అమెండ్మెంట్తో 9 నుంచి 12వ తరగతులు వరుసగా తెలంగాణ రాష్ట్రంలో చదివితేనే స్థానికులుగా పరిగణించబడుతుందని, 9వ తరగతి కంటే ముందు ఎక్కడ చదివారనే దానిని పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిపారు. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ జారీ చేసిన ఈ జీవో ప్రకారం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలంగాణలో చదివి, ఇంటర్మీడియట్ ఏపీలో చదివిన తెలంగాణ విద్యార్థులు స్థానికతను కోల్పోతున్నారని పేర్కొన్నారు.