హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)/వెంగళ్రావునగర్: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలు ఏడాదిన్నర గడచినా జాడ లేవంటూ ప్రజల్లో అగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్‌కు నిరసన సెగ తగిలింది. షేక్‌పేట్ వినాయకనగర్ డివిజన్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం తర్వాత మేయర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రూ.500కు గ్యాస్ సిలిండర్, 100 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రేషన్ కార్డులు, మహిళలకు నెలకు రూ.2500లు సాయం ఎప్పట్నుంచి అమలు చేస్తారని మహిళలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కలగజేసుకున్న మంత్రి వివేక్… తెల్ల రేషన్కారులు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తున్నామంటూ చెప్పుకొచ్చారు.
అయినా మహిళలు హామీల సంగతేంటని గట్టిగా నిలదీశారు. ఆ సమయంలోనే మేయర్ గద్వాల విజయలక్ష్మి అసహనంగా ‘అరవకమ్మా.. చెప్పింది వినవమ్మా’ అని మహిళలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మేయర్‌కు కూడా దీటుగా మహిళలు బదులిచ్చారు. ‘చాలు.. చాల్లేవమ్మా ఇంకేం చెప్పావు.. పోవమ్మా’ అంటూ మహిళలు కన్నెర్ర చేశారు. మహిళలు గట్టిగా నిలదీయడంతో సమాధానం చెప్పకుండానే మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలోనే ఇప్పుడు నేతలు వస్తున్నారని, ఏడాదిన్నరగా ఏమైపోయారని ప్రజలు ప్రశ్నించారు. చాలామంది కాలనీవాసులు మీటింగ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో సమావేశానికి ప్రజలను ఎందుకు తరలించలేదంటూ మంత్రులు తుమ్మల, వివేక్… మేయర్ విజయలక్ష్మిని, స్థానిక కాంగ్రెస్ నేతలపై రుసరుసలాడటం కనిపించింది.