హైదరాబాద్: శబరిమల యాత్రలో (Sabarimala Yathra) భాగంగా తమిళనాడులోని పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి ఉద్రిక్తతకు దారితీసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అయ్యప్ప స్వాములు ధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్ప స్వాముల బృందం శబరిమల దర్శనానికి వెళ్తున్నది. ఈక్రమంలో మార్గమధ్యంలో పళనిలోని సుబ్రమణ్య స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఓ భక్తుడు సమీప దుకాణంలో వాటర్ బాటిల్, కూల్‌డ్రింక్స్ కొనుగోలు చేయడానికి వెళ్లారు. అయితే ఎంఆర్పీ (MRP) రూ.30గా ఉండగా.. దుకాణుదారుడు రూ.40 డిమాండ్ చేశాడు. అదేంటని నిలదీయగా.. తమిళంలో తిట్టడం మొదలుపెట్టాడు. గాజు సీసాతో అయ్యప్ప భక్తుడిపై దాడి చేశాడు. దీంతో బాధితుడి తలకు తీవ్ర రక్తగాయమైంది.
అంతటితో ఆగకుండా మెడలో దండ తెంపివేశాడు. విషయం తెలుసుకున్న తోటి అయ్యప్ప భక్తులు ఒక్కొక్కరుగా ఘటనాస్థలికి చేరుకున్నారు. దాడికిపాల్పడిన దుకాణుదారుడిని నిలదీశారు. ఈ క్రమంలో స్థానికులు ఆ వ్యాపారికి అండగా నిలిచి, అయ్యప్పలతో వాగ్వాదానికి దిగారు. ఆ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. అక్కడే ఆందోళనకు దిగారు. ఎవరూ స్పందించకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్దిచేప్పే ప్రయత్నం చేశారు. అయినా తెలుగు భక్తులు వెనక్కి తగ్గకపోవడంతో చెదరగొట్టేందుకు యత్నించారు. అయితే క్రమంగా అయ్యప్పల సంఖ్య పెరిగిపోతుండటంతో నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.