హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల సంబంధిత అధికారులను ఆదేశించడంతో బీసీ రిజర్వేషన్లపై అనుమానాలు అలుముకున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలే ఇందుకు కారణమని స్పష్టమవుతున్నది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏమో గానీ సర్వోన్నత న్యాయస్థానం సూచించిన ట్రిపుల్ టెస్ట్ నిబంధనలను పాటించకుంటే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మినహా ఇప్పటికే అమలవుతున్న మిగతా అన్ని రిజర్వేషన్లూ ఊస్ట్ అయ్యే ప్రమాదం నెలకొన్నది. ట్రిపుల్ టెస్ట్ నిబంధనలను పాటించని పలు రాష్ర్టాల్లో స్థానిక ఎన్నికలను సుప్రీంకోర్టు ఇప్పటికే రద్దు చేయడాన్ని బట్టే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో ఇప్పటికీ ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా రిజర్వేషన్ల స్థిరీకరణ జరగలేదు. అయినప్పటికీ త్వరలోనే స్థానిక ఎన్నికలను నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుండటంతో బీసీ రిజర్వేషన్లపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. అసలు ట్రిపుల్ టెస్ట్ నిబంధనలను పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలను ఎలా నిర్వహిస్తుందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లను కల్పిస్తున్నారు. బీసీలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే నామమాత్రంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. గతంలో లాటరీ ద్వారా, ర్యాండమ్‌గా అశాస్త్రీయమైన పద్ధతుల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పించడంతో న్యాయవివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓబీసీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లపై కర్ణాటకకు చెందిన కేఈ కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికాస్‌రావు గవాళి కేసులో సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ పేరిట పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
గుజరాత్లో 52% ఓబీసీ జనాభా ఉన్నప్పటికీ 1990 నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి కేవలం 10% సీట్లు మాత్రమే రిజర్వు చేస్తున్నారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాల ప్రకారం డెడికేటెడ్ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయకుండా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ స్థానాలను మినహాయించి ఓబీసీలకు కేటాయిస్తూ వచ్చినప్పటికీ ఆ 10% సీట్లను కూడా జనరల్ స్థానాలుగానే పరిగణించాలని 2022 జూలై 2న ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ మేరకు గుజరాత్‌లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది. దీంతో మొత్తంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీల రిజర్వేషన్లు ప్రశ్నార్థకంగా మారిపోయాయి.
గుజరాత్ ప్రభుత్వ నిర్ణయంపై విపక్షంతోపాటు స్వపక్షం నుంచి కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గుజరాత్ ప్రభుత్వం దిగొచ్చింది. బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం ఎట్టకేలకు జస్టిస్ కేఎస్ ఝవేరి నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఓబీసీ రిజర్వేషన్లను స్థిరీకరిస్తూ 2023 ఏప్రిల్‌లో గుజరాత్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఆ నివేదికపై అదే ఏడాది ఆగస్టులో గుజరాత్ మంత్రి మండలి చర్చించి, ఓబీసీలకు 27% రిజర్వేషన్లను కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్‌ను దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు 14%, ఎస్టీలకు 7%, ఓబీసీలకు 27% చొప్పున మొత్తంగా 48% రిజర్వేషన్లను ఖరారు చేశారు. గుజరాత్లో పంచాయతీ ఎన్నికలను 2026లో నిర్వహించాల్సి ఉన్నది.
గుజరాత్‌తోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాలన్నీ డెడికేటెడ్ కమిషన్ ద్వారా రిజర్వేషన్లను స్థిరీకరించిన తర్వాతే ఎన్నికలకు నిర్వహించేందుకు సిద్ధమైన ఉదంతాలు కండ్ల ముందే ఉన్నాయి. ఆయా అంశాలను డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు నేతృత్వంలోని రాష్ట్ర బీసీ కమిషన్ సైతం ప్రభుత్వానికి చెప్తూనే ఉన్నది. కానీ, వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తాం అని రేవంత్‌రెడ్డి సర్కారు హడావుడి చేస్తుండటం వెనుక ఆంతర్యమేమితో తెలియడం లేదని బీసీ సంఘాలు మొత్తుకుంటున్నాయి. మొత్తంగా బీసీ రిజర్వేషన్లను ఎత్తేసి ఎన్నికల ను నిర్వహిస్తారా? అని అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం డాక్టర్ వకుళాభర ణం కృష్ణమోహన్ నేతృత్వంలో పూర్తిస్థాయి డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునేందుకు ఎంచుకోవాల్సిన మెథాడాలజీ, న్యాయపరమైన అంశాలను అధ్యయనం చేసేందుకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌ను కూడా నిర్దేశించడంతో ఆ దిశగా కమిషన్ అధ్యయనం చేపట్టింది.తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ రాష్ర్టాల్లో పర్యటించింది. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల వల్ల ఉత్పన్నమైన అంశాలను పరిశీలించింది. ఆయా రాష్ర్టాల్లో అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు, వారి సంక్షేమానికి చేపడుతున్న చర్యలు, జనగణనలో ఎదురైన సవాళ్లు, పరిష్కార మార్గాలు తదితర అంశాలపై అక్కడి బీసీ కమిషన్లతో సమాలోచనలు జరిపింది.
అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో కమిషన్ ప్రత్యేకంగా సమావేశాలను నిర్వహించి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో (స్థానిక సంస్థల్లో) బీసీల ప్రాతినిధ్యం, వారు పొందిన అవకాశాలకు సంబంధించి ఆయా శాఖల వద్దనున్న సమాచారాన్ని, గణాంకాలను అందజేయాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది. ఇప్పటికే ఆ సమాచారాన్ని సేకరించింది. తుది నివేదికను సిద్ధం చేసే క్రమంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చింది.
కులసర్వే నిర్వహించడం ద్వారా బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. తదనుగుణంగా కులగణన కోసం రూ.150 కోట్లను కేటాయించింది. కానీ, అందుకు సంబంధించి కమిషన్‌కు ఇంకా ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయలేదు. అంతేకాకుండా గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన మార్గదర్శాల మేరకైనా తుది నివేదికను అందించాలా? వద్దా? అనే అంశాన్ని కూడా కమిషన్‌కు తేల్చిచెప్పడం లేదు. అయినప్పటికీ త్వరలోనే స్థానిక ఎన్నికలను నిర్వహిస్తామంటూ స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటిస్తున్నారు. దీంతో మొత్తంగా బీసీ రిజర్వేషన్లు సందిగ్ధంలో పడ్డాయి. దీనిపై బీసీ సంఘాలు ఇప్పటికే రేవంత్ సర్కారును పలు విధాలుగా హెచ్చరిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలు తొలుత కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తాజా సవరించిన ఓటర్ల జాబితాను తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఆ జాబితాలను సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బీసీ రిజర్వేషన్ల కోసం ఏర్పాటైన డెడికెటెడ్ బీసీ కమిషన్‌కు అందజేయాల్సి ఉంటుంది. సదరు కమిషన్ ఓటరు జాబితాను రాష్ట్ర పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులకు పంపి, బీసీ ఓటర్ల జాబితాను నిర్ణీత నమూనాలో తెప్పించుకుంటుంటున్నది. బీసీల్లోని వివిధ కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం ఏ మేరకు ఉందన్న అంశాన్ని గతంలో జరిగిన ఎన్నికల ఆధారంగా నిర్ణయిస్తుంది. ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీ, మున్సిపాలిటీల్లో బీసీ కులాలకు రిజర్వేషన్లను ఖరారు చేసి, ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. దీనిపై మంత్రి మండలి చర్చించి, ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అది కూడా 50% మించకుండానే. ఆ తర్వాత దాని ఆధారంగానే స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది.