రవీంద్రభారతి, జనవరి7: బీసీ వాదాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రకు తెరలేపారని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ధ్వజమెత్తారు. ఇలాంటి కుయుక్తులను రేవంత్‌రెడ్డి మానుకోవాలని, 42 శాతం బీసీ కోటాతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని అల్టిమేటం జారీ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో వివిధ బీసీ కులసంఘాల, మేధావుల సభలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరించి బీసీ సమాజాన్ని నయవంచనకు గురిచేసిందని వారు ధ్వజమెత్తారు. 42 శాతం కోటా ఇవ్వకుంటే బీసీలంతా ఐక్య ఉద్యమాలకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. బీసీ ఉద్యమకారులను డబ్బు సంచులతో కొనేసి బీసీ వాదానే లేకుండా చేయాలనే దుర్మార్గపు ఆలోచన మానుకోకుంటే బీసీలు మూకుమ్మడిగా తగిన శాస్తి చెప్తారని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో సాంకేతిక పాలన చేస్తున్నట్టు చెప్తున్నారని, మనసులో మాత్రం ఇంగిత జ్ఞానం లేని దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.
స్వాతంత్య్రానంతరం ఈ 78 ఏండ్లలో బీసీలను మోసం చేసిన పార్టీలలో కాంగ్రెస్‌దే ప్రథమ స్థానమని ధ్వజమెత్తారు. నీతి, నియమాలు లేకండా పాలన సాగిస్తున్నదని, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చని పార్టీ కూడా అదేనని విమర్శించారు. సీఎం రేవంత్రెడడి శరీరం నిండా పూర్తి బీసీ వ్యతిరేకత నిండి ఉన్నదని మండిపడ్డారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలుపడం ఖాయమని హెచ్చరించారు. బీసీ దుర్మార్గపు పాలనను పారదోలి బీసీలు రిజర్వేషన్లు సాధించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టంచేశారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, లేకుంటే బీసీల వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ మిగులుతుందని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ నేతలు కొండా దేవయ్య, ర్యాగ అరుణ్‌కుమార్, నీల వెంకటేశ్, పగిళ్ల సతీశ్, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.