హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తేతెలంగాణ): పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీల రిజర్వేషన్ 42 శాతానికి పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డెడికేషన్ కమిషన్ బీసీ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వరరావుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెడికేషన్ కమిషన్ సిఫార్సు చేస్తే రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందని చెప్పారు. రాజ్యాంగాన్ని సవరించి అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచినప్పుడు.. బీసీల కోసం సవరణ చేయలేరా? అని ప్రశ్నించారు. గతంలో సుప్రీం కోర్టు అనేక కేసుల్లో జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు పెంచుకోవచ్చని తీర్పులు చెప్పినట్టు గుర్తు చేశారు. కులాలవారీగా లెక్కలు తీసి బిహార్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 60 శాతానికి పెంచిందని తమిళనాడులోనూ బీసీలకు 69 శాతం రిజర్వేషన్ కల్పించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కూటమికి పార్లమెంట్లో మంచి మెజార్టీ ఉన్నందున బీసీ రిజర్వేషన్ల బిల్లుపెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయని అభిప్రాయపడ్డారు.