హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరింత ఊపందుకున్నది. ఎన్నికలు నిర్వహించడం కోసం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 5,773, జడ్పీటీసీ స్థానాలు 566 ఉన్నట్టు ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పో లింగ్ సిబ్బంది వివరాలను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది. ఎంపీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఉండటంతో అధికారులతోపాటు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేయాలని జడ్పీ ఈసీవోలు, జిల్లాల పంచాయతీ అధికారులకు పీఆర్ఆర్డీ శాఖ డైరెక్టర్ సృజన గురువారం ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మం డల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు సంబంధించిన ఎన్నికలు- 2025 నిర్వహణకు అవసరమైన ఎన్నికల సామగ్రిని అన్ని జిల్లాలకు సరఫరా చేయాలని పీఆర్ఆర్డీ శాఖ డైరెక్టర్ సృజన సూచించారు. తమ జిల్లాలకు సరఫరా అయిన సామగ్రిని సమీక్షించి, సరిగా పనిచేస్తున్నవో లేదో కూడా తనిఖీ చేసి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
గులాబీ, తెలుపు పోలింగ్ పేపర్లు, పేపర్ సీళ్లు, అడ్రస్ ట్యాగ్ లు, హ్యాండ్‌బుక్స్, స్టాట్యూటరీ, నాన్-స్టాట్యూటరీ ఫారంలు, కవర్లు వంటి సామగ్రి నిరుడే సరఫరా అయినందున, వాటి స్థితిని పరిశీలించాలని సూచించారు. హైకోర్టు ఇ చ్చిన ఉత్తర్వుల ప్రకారం ఎన్నికల ప్రక్రియను సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలని స్పష్టంచేశారు. లోపాలు జరిగితే జెడ్పీ సీఈవోలు, డీపీవోలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.