మంచిర్యాల, జూలై 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ ఎమ్మెల్యేతో కాంగ్రెస్ ముఖ్యనేతల స్నేహబంధం ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో అగ్గిరాజేసింది. ఆదిలాబాద్‌లో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట భూసేకరణ చేస్తూ పరిహారం రూపంలో రూ.వందల కోట్లు.. ఇండస్ట్రియల్ పార్క్ లే అవుట్ అభివృద్ధి, టెండర్ల పేరుతో అదనంగా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ముఖ్యనేత, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేసిన ప్లాన్ బహిర్గతం కావడంతో స్థానిక అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలను గాలికి వదిలేసి బీజేపీతో అంట కాగుతున్నారని ఆదిలాబాద్‌లో అధికార పార్టీ నాయకులు కొంతకాలంగా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఆదిలాబాద్ జిల్లాలో ఆ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ నరేశ్ జాదవ్, ఎమ్మెల్యేగా పోటీ చేసిన కంది శ్రీనివాస్‌రెడ్డిది ఏం నడవని దుస్థితి. కనీసం పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామనే భావనలో ఆ పార్టీ నాయకులు ఉన్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, ఇతర మంత్రులను నిత్యం కలుస్తున్నానని ఎమ్మెల్యే బాహాటంగానే ప్రకటిస్తుండటంతో ఏం చేయాలో, ఎవరికి తమ బాధలు చెప్పుకోవాలో తెలియక సతమతమైపోతున్నామని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనలు, జిల్లాలో వినిపిస్తున్న గుసుగుసలను పరిశీలిస్తే బీజేపీ ఎమ్మెల్యేకు సీఎం సహా మంత్రులు ఇస్తున్న ప్రయారిటీ ఏంటో అర్థమవుతున్నది.
మిలాఖత్కు ఆధారాలెన్నో..
సీఎం వచ్చిన ప్రతిసారి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ నాయకులంటే ఎక్కువ సీఎంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అడిగిన వెంటనే ఎయిర్పోర్ట్ ఇచ్చారని.. ఇచ్చిన మాటపై ఉన్నారని, ఆదిలాబాద్‌కు ఏ అవసరం ఉన్నా తీరుస్తామని ప్రధానీ మోదీ సమక్షంలో హమీ ఇచ్చారంటూ ఊదరగొడుతున్నారు. 13 ఏండ్ల క్రితం టీడీపీలో ఉన్నప్పుడు తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారని, ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటూ పాత దోస్తీని సైతం గుర్తు చేసుకున్నారు. ఇలా నిరుడు డిసెంబర్ 4న ఆదిలాబాద్‌లో నిర్వహించిన సభలో పాయల్‌శంకర్ సీఎం రేవంత్‌రెడ్డిని ఆకాశానికి ఎత్తడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఓ బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఇంతలా ప్రశంసించడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.
సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఈ ఏడాది జనవరి 16న నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో అభివృద్ధి కోసం తాను మోదీని కలుస్తున్నానని, అలాగే రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు తనను కలిస్తే అభివృద్ధి జరుగుతుందంటూ మరో సభలో బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ఎంపీ నగేశ్ కలుస్తున్నారంటూ.. వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చి మాట్లాడిన సందర్భాలు సైతం లేకపోలేదు. ఇలా సీఎంతో బీజేపీ ఎమ్మెల్యేల మిలాఖాత్కు ఎన్నో ఆధారాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్రిలో ఏప్రిల్ 6, 2026లో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక బహిరంగ సభ నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) మూడేండ్ల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ సభకు సైతం ఎమ్మెల్యే హాజరు కావడంపై డిప్యూటీ సీఎం భట్టి సహా కాంగ్రెస్‌లోని ఆయన వర్గం నాయకులు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
సీక్రెట్ టూర్లలోనూ పాయల్ పార్ట్నర్..
సభల పేరుతో సీఎం, ఇతర మంత్రులు ఆదిలాబాద్‌కు వచ్చిన ప్రతిసారి ఏరియల్ సర్వేలు చేశారన్న ఆరోపణలొస్తున్నాయి. నిజంగా ఆదిలాబాద్ అభివృద్ధిని ఆకాంక్షించే నాయకులైతే అధికారులు పాల్గొనకుండా కాంగ్రెస్ నాయకులు, మంత్రుల సీక్రెట్ టూర్లలో పాయల్‌శంకర్ పాల్గొనాల్సిన అవసరం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. చనాకా-కొరాట పంప్ హౌస్ ట్రయల్న్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనవరి 16న హాథీఘాట్ ప్రధాన కాలువకు నీటి విడుదల చేశారు. ఈ సందర్భంగా హెలికాప్టర్లో హాథీఘాట్కు వచ్చిన సీఎంతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఏరియల్ వ్యూలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రతిపాదిస్తున్న భూములను చూపించినట్టు చెప్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే రహస్యంగా సమావేశమయ్యారు. మీడియాను అనుమతించకుండా సీక్రెట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం 2026 ఫిబ్రవరి 26న జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి సీక్రెట్‌గా వచ్చి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇందులో పాయల్‌శంకర్ సైతం పాల్గొన్నారు. ఈ సీక్రెట్ సర్వే ఎందుకు అన్న దానిపైనా గతంలో పలు కథనాలు వచ్చాయి. ఇక 2026 ఏప్రిల్ 25న మంత్రి పొన్నం ప్రభాకర్ హెలికాప్టర్లో ఆదిలాబాద్‌కు వచ్చారు. తిరిగి వెళ్తున్న ఆయన్ని పాయల్ శంకర్ బలవంతం చేసి హెలికాప్టర్లో ఎక్కారని, ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ భూములును చూపించారన్న ఆరోపణలు సైతం వచ్చాయి. ఇలా సీఎం స్థాయి నుంచి మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు అందరితో పాయల్ స్నేహం వెనుక ఇంత కుట్రదాగి ఉందని తెలిసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. పాయల్‌కు ప్రియారిటీ ఇవ్వడానికి కారణం ఇదా.. అంటూ నోరెళ్లబెడుతున్నారు.
కేస్ స్టడీ-1: కాంగ్రెస్ సర్కార్‌లో బీజేపీ ఎమ్మెల్యేలకే పనులు
జూన్ 27వ తేదీన సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే.. ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నిరసన గళం వినిపించారు. “తాను నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా, ఆదిలాబాద్‌లో నరేవ్ జాదవ్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాం.
ఆదిలాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిర్మల్‌లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకులకే ప్రాధాన్యం ఇస్తుండటంతో కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎవరో మూతి, ముఖం తెలియని వారికి ఇస్తున్నారు. మా పిల్లలు పని చేయడానికి అర్హులు కాదా..? ఎమ్మెల్యేలు చెప్పారని మంత్రులు అధికారులకు ఫోన్ చేసి చెప్పే ముందు స్థానిక డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేను అడగాలి. చివరకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరులోనూ మంత్రి చెప్పిన వారికి ఇచ్చామని అధికారులు చెప్తున్నారు. మాకు ఏం తెలియడం లేదు” అంటూ వెడ్మ బొజ్జు మాట్లాడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కేస్ స్టడీ-2: బీజేపీ ఎమ్మెల్యేలు అడిగింది చేయాల్సిందే!
టీయూఎఫ్ఐడీసీ(తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 27 వార్డుల్లో రూ.13.50కోట్ల విలువైన 27 పనులకు మంజూరు ఇచ్చింది. కాగా ఇందులో బీజేపీ కౌన్సిలర్లు లేదా బీజేపీ మద్దతుదారులైన కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులకే అధిక ప్రియారిటీ ఇచ్చారని, అధికార కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీల కౌన్సిలర్లను లెక్కలోకి తీసుకోలేదని సొంత పార్టీ నాయకులే అసహనంతో ఉన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే చెప్పారని ఇలా పనులు కేటాయిస్తే.. తాము పార్టీలో ఉండలేమని ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత ప్రభుత్వంలో కీలకంగా ఉండి, ఆదిలాబాద్ బాధ్యతలు చూస్తున్న మరో రెడ్డి సామాజిక వర్గ నేతను కలిసినట్టు వినికిడి. ఇలాగైతే మేము రాజకీయాలు చేయలేమని కంది శ్రీనివాస్‌రెడ్డి చెప్పగా.. సదరు నేత.. పార్టీ నుంచే చెప్పారు. ఆ ఎమ్మెల్యే మన పార్టీలో చేరుతారట.. ఆయన ఏం అడిగితే అది చేయమన్నారు. మీకు ఉండాలనిపిస్తే ఉండండి లేకపోతే వెళ్లిపోండి అని చెప్పినట్టు సమాచారం. దీంతో చిన్నబుచ్చుకున్న సదరు నేత సన్నిహితులు, అనుచరులు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరుతారంట… ఇక మన దారి మనం చూసుకోవడం మంచిది. నాపై నమ్మకం ఉన్నవారు నాతో ఉండాలని చెప్పుకొన్నారన్న గుసగుసలు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి.
కేస్ స్టడీ-3: ఇందిరమ్మ ఇండ్లలో వారికే ప్రాధాన్యం
ఇందిరమ్మ ఇండ్ల విషయంలోనూ బీజేపీ జోక్యం ఎక్కువైపోయిందని కాంగ్రెస్ నాయకులు పాపోతున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, బీఆర్ఎస్ గతంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో బీజేపీ ఎమ్మెల్యే చెప్పిన వారికే పెద్దపీట వేశారని.. ఇందిరమ్మ కమిటీలో ఉన్న కాంగ్రెసోళ్లు చెప్పిన వారికి కాకుండా బీజేపీ కౌన్సిలర్లు చెప్పిన వారికే ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
ఒక్క ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనే దాదాపు 200 ఇండ్లను ఎమ్మెల్యే సిఫార్సు చేయగా, మరో 200 ఇండ్లు దాదాపు బీజేపీ కౌన్సిలర్లు చెప్పిన వారికి ఇచ్చినట్టు చెబుతున్నారు. కనీసం మా కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్లు సైతం ఇప్పించుకోలేకపోయామని వాపోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో గతంలో 300 మందిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయగా మిగిలిన 600 నుంచి 700 ఇండ్లను బీజేపీ నాయకులు చెప్పిన వారికే ఇచ్చారని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. ఈ వ్యవహారంపైనా కాంగ్రెస్ లీడర్లు గుర్రుగా ఉన్నట్టు తెలిసింది.