హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని 565 జడ్పీటీసీలు, 5,749 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటి విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నోటిఫికేషన్ విడుదల చేసింది. తక్షణమే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించింది. గత నెల 29న ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. మొదటి దశలో భాగంగా 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాల్లో అక్టోబర్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11న నామినేషన్ల గడువు ముగుస్తుంది. అక్టోబర్ 12న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.
ఇక రెండో విడుతలో మిగిలిన స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. అక్టోబర్ 13న నామినేషన్ స్వీకరణ ప్రక్రియను మొదలు పెట్టి ఈ నెల 15న ముగిస్తారు. అక్టోబర్ 16న నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తారు. అక్టోబర్ 19 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 27న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 11న రెండు విడతలకు సంబంధించి ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడిస్తారు.
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియను మూడు విడతల్లో నిర్వహించాలని నిర్ణయించారు. 12,733 సర్పంచులు, 1,12,288 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతకు సంబంధించి అక్టోబర్ 17న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించి అక్టోబర్ 19న ముగిస్తారు. అక్టోబర్ 20న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అక్టోబర్ 31న ఉదయం పోలింగ్ నిర్వహించి అదేరోజు మధ్యాహ్నం తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రెండో విడతకు సంబంధించి.. అక్టోబర్ 21న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమై అక్టోబర్ 23 వరకు ముగిస్తారు. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 24న నిర్వహిస్తారు. అక్టోబర్ 27 వరకు నామినేషన్ల ఉపసంహరణ, నవంబర్ 4న ఉదయం ఎన్నికలు నిర్వహించి అదేరోజూ ఫలితాలు వెల్లడిస్తారు. మూడో విడతకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 25న మొదలై అక్టోబర్ 27న ముగుస్తుంది. అక్టోబర్ 28న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 31 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. నవంబర్ 8న ఉదయం పోలింగ్ నిర్వహించి అదేరోజూ మధ్యాహ్నం తర్వాత ఓట్ల్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.