హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కొత్త కమిషనర్ పోస్టుకు లాబీయింగ్ మొదలైంది. ఈ పోస్టుకు అర్హులైన 10 మందితో కూడిన సీనియర్ సివిల్ సర్జన్ల జాబితాను వైద్యశాఖ ఉన్నతాధికారులు సిద్ధం చేశారు. ఈ జాబితా ఇప్పటికే సీఎంవోకు చేరినట్టు తెలిసింది. టీవీవీపీని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డీఎస్‌హెచ్ (డైరెక్టర్ ఆఫ్ సెకండరీ)గా మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 18న డీఎస్హెచ్ను హెచ్వోడీగా పరిగణిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇన్ని రోజులు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఉన్న టీవీవీపీ పరిధి, నిధులు, దవాఖానల పర్యవేక్షణ.. బాధ్యతలు పెంచడంతో ఈ పోస్టుకు పోటీ నెలకొంది. లిస్టులో ప్రధానంగా ఇద్దరి మధ్య పోటీ నెలకొన్నట్టు వైద్య వర్గాలు చెప్తున్నాయి.
లిస్టులో ప్రముఖంగా వినిపిస్తున్న ఓ దవాఖాన సూపరింటెండెంట్ ఓ మంత్రి ద్వారా పోస్టును పొందేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ఇప్పటికే టీవీవీపీలో కీలక పోస్టులో ఉన్న మరో అధికారి రెడ్డి కోటాలో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. వీరితో పాటు లిస్టులో ఉన్న వారు సైతం తమ పలుకుబడితో మంత్రులు, ఐఏఎస్ అధికారుల ద్వారా పైరవీలు మొదలుపెట్టినట్టు తెలిసింది. తమ సీనియారిటీని, వైద్యశాఖలో చేసిన సేవలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నట్టు సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పోస్టుకు లెఫ్ట్ ఓవర్ సర్వీసు రెండేండ్లు ఉండాలి. దీంతోపాటు వివాదరహితులకు ప్రాధాన్యం ఇస్తారు.
ఇక టీవీవీపీ కొత్త కమిషనర్ ఫైల్ సీఎంవోలో ఉండగా.. అక్కడ పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి వద్దకు చేరనున్నది. ఈ పోస్టు నియామకాన్ని పారదర్శకంగా చేపట్టాలని వైద్యులు కోరుతున్నారు. టీవీవీపీ కమిషనర్‌గా ఉన్న అజయ్‌కుమార్ గత నెల 31న ఉద్యోగ విరమణ చేయడంతో ఈ సీటు ఖాళీ అయింది. నెల కావస్తున్నా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టును భర్తీ చేయలేదు. రాష్ట్రంలో 183 దవాఖానలు టీవీవీపీ పరిధిలో ఉన్నాయి. ఇంతటి కీలక పోస్టుకు నియామకం విషయంలో కాంగ్రెస్ సర్కార్ జాప్యం చేయడంతో టీవీవీపీలో పాలన స్తంభించిందని పలువురు వైద్యులు వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పోస్టును వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.