దుండిగల్, ఫిబ్రవరి 27: బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా ఐదు రకాల కార్యక్రమాలను అమలుచేస్తున్నారని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి పేర్కొన్నారు. హైదరాబాద్ శివారు ప్రగతినగర్‌లోని పుచ్చలపల్లి లీలాసుందరయ్య భవన్లో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. పరిషత్తు ద్వారా అమలుచేస్తున్న కార్యక్రమాలను వివరించారు. విదేశీ ఉన్నత చదువుల నిమిత్తం 500 మంది బ్రాహ్మణ విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్టు చెప్పారు. ఔత్సాహిక బ్రాహ్మణ పారిశ్రామికవేత్తలకు బెస్ట్స్కీం ద్వారా రూ.100 కోట్లతో సబ్సిడీ రుణాలు అందజేస్తున్నట్టు తెలిపారు.
ఏప్రిల్ నెలాఖరు కల్లా దరఖాస్తుదారులందరికీ రుణాలు అందజేస్తామని వెల్లడించారు. ఆయా పథకాలకు తప్పనిసరిగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేశారు. టీఆర్ఎస్ నాయకుడు సముద్రాల వేణుగోపాలచారి మాట్లాడుతూ.. బ్రాహ్మణులు అధికంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌తో పాటు మరే రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏర్పాటు చేసి, అభివృద్ధికి పాటుపడుతున్నారని చెప్పారు. ఈ పథకం అమలులో దళారుల ప్రమేయం లేదని, నిధులకు కొరత లేదని పేర్కొన్నారు. సదస్సులో బ్రాహ్మణ పరిషత్తు సభ్యులు మృత్యుంజయశర్మ, అష్టకాల రామ్మోహన్, జోషి గోపాలశర్మ, ఎస్ సుమలతాశర్మ, డాక్టర్ సువర్ణ సులోచన, వెంకటరమణశర్మ, హన్మంతాచారి, కాండూరి నరేంద్రాచారి, కరీంనగర్ జిల్లా బ్రాహ్మణ పరిషత్తు అధ్యక్షుడు కొత్తకొండ రవీందర్‌తో పాటు పెద్దసంఖ్యలో బ్రాహ్మణులు పాల్గొన్నారు.