APGVB | టేకుమట్ల, ఆగస్టు 9: రుణమాఫీ డబ్బులు తప్పకుండా రైతులకే ఇవ్వాలని, పాత బకాయిల కింద ఆపొద్దని ప్రభుత్వం చెప్తున్నా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ (APGVB) అధికారులు ససేమిరా అంటున్నారు. మహిళా సంఘంలో ఉన్న అప్పు కింద రుణమాఫీ డబ్బులు పట్టుకుని రైతు దంపతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మండలంలోని గర్మిళ్లపల్లి శివారు కలికోటపల్లికి చెందిన పిట్టల సారయ్య దంపతులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘మాకు ప్రభుత్వం రూ.48 వేల రుణం మాఫీ చేసినట్టు లిస్టులో పేరు వచ్చింది. బ్యాంక్‌కు వెళ్లి అడిగితే.. ‘వడ్డీ రూ.6 వేలు అయింది.
కట్టాలంటే అప్పు తెచ్చి కట్టినం. మాఫీ పైసలు మా అకౌంట్లో వేస్తామని చెప్పారు. వారం రోజులు తిప్పించుకున్నరు. తీరా ఇప్పుడు బ్యాంకులో డబ్బులు లేవు బయట తీసుకోండని చెప్పారు. బయట తీసుకునేందుకు వెళ్తే అకౌంట్ బ్లాక్ అయిందంటున్నారు. మళ్లీ ఏపీజీవీబీకి వెళ్లి డబ్బులు అడిగితే.. మీ భార్య మహిళా సంఘంలో అప్పు తీసుకుంది. అవి కడితేనే ఇస్తాం. లేకుంటే ఇవ్వం’ అంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఇప్పుడు రూ.20 వేలు ఆపుకోండి, మిగితావి నెలనెలా కడుతాం‘ అని ఎంత వేడుకున్నా డబ్బులు ఇస్తలేరని, వడ్డీకి తెచ్చిన అప్పు తీర్చకుంటే పరువు పోతుందని రైతు దంపతులు విలపిస్తున్నారు.