హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూమ్భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ పేదలకు అనుకూలమైంది కాదని విమర్శించారు. ఆసరా పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంపు, మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి/ షాదీముబారక్ పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ల అమలుపై దృష్టి సారించాలని కోరారు. సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంలేదని గురువారం లోక్సభలో కేంద్ర ప్రభుత్వం చెప్పడం తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేయడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తున్నదని విమర్శించారు.