హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ):పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్న ప్రతి రైతుకు రూ.2 లక్షల లోపు రుణం మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో వ్యవసాయ పద్దుపై జరిగిన చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలపై మంత్రి తుమ్మల స్పందించారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు బ్యాంకుల్లో రైతులకు ఉన్న అప్పుల వివరాలను తెప్పించామని, పాస్‌బుక్‌లు, రేషన్‌కార్డులు లేని రైతుల ఇంటివద్దకు వెళ్లి, వివరాలు సేకరించి రూ.2 లక్షల రుణమాఫీని ఎలాంటి నిబంధనలు లేకుండా అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం అమలుచేస్తుందని స్పష్టంచేశారు. రైతుభరోసా పథకాన్ని ఎలా అమలుచేయాలనే అంశంపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. నిపుణులు, రైతులు, అధికారులు, ప్రజలతో విస్తృతంగా చర్చిస్తున్నామని వివరించారు. పంట వేసిన రైతుకే రైతుభరోసా ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పంటల బీమా పథకాన్ని కూడా తప్పక అమలు చేస్తామని పేర్కొన్నారు.