కోదాడ, ఆగస్టు 9 : అర్హులందరికీ రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతితో కలిసి రైతులు, కాంగ్రెస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. రైతు భరోసా, రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్‌పై చర్చించారు. రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. 3వ విడత రుణమాఫీ ఆగస్టు 15కల్లా పూర్తవుతుందని మంత్రి చెప్పారు. వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. రైతు భరోసాపై మాట్లాడుతూ.. నాలుగు జిల్లాల్లో రైతుల అభిప్రాయాలు సేకరించాల్సిన ఉందని, పంట పండించే రైతులకే భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కౌలు రైతులను గుర్తించే అంశంపైనా అభిప్రాయాలు సేకరించాకే నిధులు విడుదల చేస్తామన్నారు. ఆయిల్‌పామ్ సాగు చేసేవారికి ప్రభుత్వం ఎకరాకు రూ.55 వేల సబ్సిడీ అందజేస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.