Runa Mafi | వికారాబాద్, ఆగస్టు 21, (నమస్తే తెలంగాణ): జిల్లాలో రుణమాఫీకాని రైతులు ఆందోళన బాట పట్టారు. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు రుణమాఫీ అయి అర్హులైన పేద రైతులకు రుణమాఫీ కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగులను రుణమాఫీ జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వం.. స్పీకర్ హోదాలో ఉన్న ప్రసాద్‌కుమార్ రుణాలను ఏ విధంగా మాఫీ చేశారని నిలదీస్తున్నారు. స్పీకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న వికారాబాద్ నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లి గ్రామాన్ని నమస్తే తెలంగాణ సందర్శించగా రుణమాఫీకాని రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లిలో రూ.2లక్షలలోపు రుణాలు తీసుకున్న రైతులు సుమారు 600 మంది ఉండగా, వీరిలో కేవలం 180 మందికే రుణాలు మాఫీ అయ్యాయి. రైతుల్లో ఎక్కువమంది రేషన్‌కార్డు లేకపోవడంతోనే నష్టపోయారు. బ్యాంకులు రేషన్‌కార్డు చూసి రుణం ఇచ్చిందా? పట్టాదారు పాసు పుస్తకాన్ని చూసి రుణాలను మంజూరు చేసిందా? అంటూ ప్రభుత్వాన్ని మైలార్‌దేవ్‌పల్లి రైతులు ప్రశ్నిస్తున్నారు.
స్పీకర్‌కు మాఫీ పొరపాటే
రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ బ్యాంకు ఖాతా నంబర్‌కు రైతు రుణమాఫీ పథకం కింద రూ. 1,50,863 పొరపాటున జమ చేయబడినవని వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు డీసీసీబీలో టెక్నికల్ సమస్య వలన ఈ అమౌంట్ గడ్డం ప్రసాద్ కుమార్ బ్యాంకు ఖాతాలోకి జమ అయ్యాయని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పీకర్ ప్రసాద్‌కుమార్ స్పందిస్తూ తన బ్యాంకు అకౌంట్‌కు పొరపాటున వచ్చిన రూపాయలను తిరిగి అదే బ్యాంక్ ద్వారా ప్రభుత్వానికి వాపసు చేస్తున్నట్టు తెలిపారు.
ఇది చెల్లని ప్రభుత్వం
నేను వికారాబాద్‌లోని తెలంగాణ గొల్కోండ గ్రామీణ బ్యాంకులో రూ.1.80లక్షలు, మా భార్య పేరిట రూ.1.20 లక్షల రుణం తీసుకున్నాం. మూడువిడతల్లో మా ఇద్దరిలో ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదు. దీనిపై ప్రశ్నిస్తే బ్యాంకు సిబ్బంది, వ్యవసాయాధికారులు ఒకరిపైఒకరు చెప్పుకుంటున్నారు. ఇది చెల్లని ప్రభుత్వం.
– సామ కరుణాకర్ రెడ్డి,మైలార్‌దేవ్‌పల్లి
బ్యాంకర్ల నిర్లక్ష్యం రైతులకు నష్టం
నేను రూ.1.60 లక్షల రుణం తీసుకున్నాను. ప్రతీ ఏటా రెన్యూవల్ చేస్తున్నాను. మూడో విడతలో మాఫీ అవుతుందని వ్యవసాయాధికారులు చెప్పారు కానీ ఇప్పటివరకు మాఫీ కాలేదు. బ్యాంకు అధికారులను అడిగితే రెన్యూవల్ చేసుకోలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. బ్యాంకు అధికారులు చేసిన తప్పుకు రైతులకు నష్టం చేయడం ప్రభుత్వానికి తగదు.
– ఎస్.మాణిక్ రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి
మిత్తి కట్టినా మాఫీ కాలేదు
నేను రూ.2 లక్షల రుణం తీసుకున్నాను. ప్రతీ ఏటా రెన్యూవల్ చేస్తున్నాను. మిత్తి డబ్బులను చెల్లిస్తే రూ.2 లక్షలలోపు రుణమాఫీ అవుతుందని వ్యవసాయాధికారులు తెలిపారు. మిత్తి డబ్బులను పదిహేను రోజుల క్రితమే చెల్లించాను. ఇప్పటికీ నా రుణం మాఫీ కాలేదు.
– ఆలంపల్లి మల్రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి వికారాబాద్ జిల్లా