హైదరాబాద్, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక సభ్యులను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్(ఎన్ఆర్ఎల్ఎం) రుణాలను అందించేందుకు శ్రీకారం చుట్టింది. పథకంలో భాగంగా రాష్ట్రంలోని 36వేల మందికి అతి తక్కువ వడ్డీతో ఒక్కొక్కరికీ రూ.40వేల చొప్పున అందజేయనున్నది. రాష్ట్రంలో 18వేల గ్రామ సమాఖ్యలు ఉండగా ఎన్ఆర్ఎల్ఎం రుణాల కింద గ్రామ సమాఖ్యలకు కేంద్రం రూ.144కోట్లను అందజేయనున్నది. తీసుకున్న రుణాలతో గ్రామాల్లో సూక్ష్మ తరహా పరిశ్రమలను స్థాపించాల్సి ఉంటుంది. లబ్ధిదారుల ఎంపికను నెలాఖరు వరకు పూర్తిచేయాలని నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ అధికారులు రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా రుణాన్ని తీసుకునే సభ్యురా లు, తిరిగి కేంద్రానికి చెల్లించకుండా గ్రామ సమాఖ్యకు చెల్లించాల్సి ఉంటుంది. అలా రికవరీ అయిన డబ్బులను గ్రామ సమాఖ్య ఇతర సభ్యులకు రుణాలు ఇచ్చేందుకు ఉపయోగించాలని అధికారులు తెలిపారు.
హోటల్లో 20రోజులపాటు బాలిక నిర్బంధం
సిటీబ్యూరో, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): ఇన్స్టాగ్రామ్ పరిచయం ఆ బాలికకు శాపంగా మారింది. ఓ మోసగాడి ఉచ్చులో పడిన ఆ బాలిక హైదరాబాద్‌లోని ఓ హోటల్లో 20రోజులు నిర్బంధంలో చిక్కుకున్నది. చివరికి వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు లోకేషన్ షేర్ చేయగా, షీటీమ్స్ సాయంతో బయటపడింది. సైబర్ క్రైమ్స్, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం…నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మాయమాటలతో ఆమెను హైదరాబాద్‌కు రప్పించాడు. అనంతరం ఓ హోటల్లో బాలికను 20రోజులపాటు బంధించాడు. తల్లిదండ్రులు షీటీమ్స్‌ను ఆశ్రయించగా, నారాయణగూడలోని ఓ హోటల్లో ఉన్నట్లు గుర్తించి ఆమెను కాపాడారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.