హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి తదితర జిల్లాల్లోని గ్రామ పంచాయతీల లే-అవుట్ల జాబితా హెచ్ఎండీఏ వెబ్సైట్లో ప్రత్యక్షమైంది. ఆ లే-అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నట్టు ఆ జాబితాలో పేర్కొన్నారు. ఇది వివాదాస్పదంగా మారడంతో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా స్తంభిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆలస్యంగా మేల్కొన్న అధికారులు హెచ్ఎండీఏ వెబ్సైట్ నుంచి ఆ జాబితాను తొలగించారు. దీంతో వివాదం సద్దుమణిగినప్పటికీ నిషేధిత జాబితా పేరిట జీపీ లే-అవుట్లు హెచ్ఎండీఏ అధికారిక వెబ్సైట్లోకి ఎలా వచ్చాయన్న దానిపై రంధ్రాన్వేషణకు దిగారు. ఈ వివాదానికి బాధ్యులైన సిబ్బందిని తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. కానీ, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేకుండా కింది స్థాయి సిబ్బంది కీలక వ్యవహారాల జోలికి ఎలా వెళ్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారుల అత్యుత్సాహమే ఈ వివాదానికి కారణమని హెచ్ఎండీఏ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కింది స్థాయి సిబ్బందిని బలి చేయకుండా ఉన్నతాధికారులపైనే చర్యలు చేపట్టాలని ఆ వర్గాలు కోరుతున్నాయి.