తిమ్మాపూర్: గ్రామాల్లో మద్యం ఏరులైపారుతోంది. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ దందా జోరు (Belt Shops) పెరుగుతున్నది. ప్రతీ గ్రామానికో మెడికల్ షాప్ ఉంటుందో ఉండదో కానీ, వీధికొక బెల్ట్ షాప్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడో ఎలక్షన్లప్పుడో, కొన్ని సందర్భాల్లో నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్న పోలీస్, ఎక్సైజ్ శాఖలు తర్వాత వారికి సహకరించినంత పని చేస్తున్నారు.
ప్రోత్సహిస్తున్న వైన్సు నిర్వహకులు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో అల్గునూర్, నుస్తులాపూర్, కొత్తపల్లి, తిమ్మాపూర్‌లో ప్రభుత్వం లైసెన్సు ఇచ్చిన అధికారికంగా ఉన్న వైన్సులున్నాయి. వీటి ద్వారా మండలంలో వినియోగదారులకు మద్యం సరాఫరా చేయాలి. అయితే వైన్సులకు వెళ్లలేనివారు, రాత్రి వైన్సులు లేని సమయంలో మద్యం అవసరం ఉన్నవారు బెల్టాపుల్లోనే కొనుగోలు చేస్తున్నారు. వీరికి వైన్సు నిర్వహకులు కొండంత అండగా ఉంటున్నారు. మీ దగ్గరికి ఎవరూ రారు.. మేము చూసుకుంటాం అని భరోసానిస్తున్నారు. అందుకుగానూ ఒక్కో బీరుపై రూ.10, మద్యం బాటిల్‌పై రూ.10 నుంచి 30 వసూలు చేస్తున్నారు. బెల్ట్ షాప్ నిర్వహకులు వినియోగదారుల నుంచి ఒక్కో సీసాపై రూ.30-50 వసూలు చేస్తున్నారు.
వైన్సుల్లో స్పెషల్ కౌంటర్..
ఈ బెల్ట్ షాపుల నిర్వహకులకు మద్యం అమ్మేందుకు వైన్సుల్లో స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సాధరణంగా వినియోగదారులకు ఇచ్చే కౌంటర్‌తో పాటు పక్కనే ప్రత్యేక షెట్టర్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. చట్టపరంగా ఒక వ్యక్తికి పరిమిత స్థాయిలోనే మద్యం అమ్మాలి. కానీ బెల్ట్ నిర్వహకుల నుంచి అక్రమంగా వసూళు చేసుకుని ఎన్నంటే అన్ని కాటన్లు ఇచ్చేస్తున్నారు. వీరు ఇస్తున్న అండతో గ్రామాల్లో విచ్చలవిడి అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పెద్ద గ్రామాల్లో గ్రామానికి పదిపైనే ఉండగా.. చిన్న గ్రామాల్లో సైతం నాలుగైదు దుకాణాలు ఉంటున్నాయి.
కిరాణ కొట్టులే.. బెల్ట్ షాపులు..
ఒకప్పుడు బెల్ట్ షాపులు గ్రామానికి రెండు మూడు భయంభయంగా నిర్వహించేవారు. కానీ నేడు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. అయితే బెల్ట్ షాపులంటే మద్యం దుకాణాల్లా కనిపించవు. గ్రామాల్లో ఉన్న కిరణాషాపుల్లోనే చాలావరకు మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఏ రాత్రి వెళ్లినా వీరి వద్ద మద్యం లభిస్తుంది. ఎన్నికల సమయంలో అడపాదడపా దాడులు చేసే ఆబ్కారీ శాఖ, పోలీసులు మళ్లీ గ్రామాల వైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో ఇష్టారీతిన అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
తరుచూ గొడవలు..
వైన్సులు రాత్రి 10 గంటలకు మూసివేయడంతో మందుబాబులు బెల్ట్ షాపుల్లో కొనుగోలు చేయడానికి వచ్చి తరుచూ గొడవలు సృష్టిస్తున్నారు. ఆయా షాపుల పక్కనున్న కుటుంబాలకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అల్గునూర్‌లో బెల్టాపుల నిర్వహకులు అర్థరాత్రి గొడవ పెట్టుకుని ఓ వర్గం మరో వర్గం ఇంటి పైకి వెళ్లి భీభత్సం సృష్టించి పోలీసులకే చుక్కలు చూపించారు. ఇరు వర్గాలపై ఎల్ఎండీ ఎస్ఐ వివేక్ సీరియస్ అయి కేసు నమోదు చేశారు. అయినా మళ్లీ రహస్యంగా అర్థరాత్రి అమ్మకాలు జరుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ బెల్టాపులను నిర్మూలించి ప్రశాంతత కల్పించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.
అర్ధరాత్రి 100కు ఫోన్లు..
గ్రామాల్లో నిత్యం ఎక్కడోచోట తాగుబోతులు గొడవలు సృష్టిస్తున్నారు. మళ్లీ వారే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే బెల్ట్ షాపుల్లో ఉద్దెర ఇవ్వకపోయినా డయల్ 100కు కాల్స్ చేసి పోలీసులను తిప్పలు పెడుతున్నారు. ఏదైనా సంఘటన జరిగిందని బ్లూకోల్ట్స్ పోలీసులు గ్రామాలకు చేరుకునే సరికి అక్కడి నుండి వెళ్లిపోతున్నారు.
కేసులు నమోదు చేస్తాం..
తిమ్మాపూర్ సర్కిల్ పరిధిలోని తిమ్మాపూర్, మానకొండూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లో నిత్యం మా సిబ్బంది సోదాలు నిర్వహిస్తున్నారని తిమ్మాపూర్ ఎక్సైజ్ సీఐ బాబా చెప్పారు. ఇటీవలే అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్న వారిపై 4 కేసులు సైతం నమోదు చేశాం. అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మకాలు జరిపితే చర్యలు తీసుకుంటాం. తమ ఎస్ఐలు రోజుకో మండలానికి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.