హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : మందుబాబులపై మరోసారి ధరల పిడుగు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ధరలు పెంచి రెండు వారాలు గడవకముందే మళ్లీ అవే బ్రాండ్ల ధరలు పెంచటానికి రంగం సిద్ధం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, విదేశీ స్కాచ్ (ఐఎఫ్‌ఎమ్‌ఎల్) ధరలు 10 శాతం మేర పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఇది అమలైతే బ్రాండ్‌ను బట్టి క్వార్టర్ మీద రూ.10 నుంచి రూ.80 వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. తద్వారా రేవంత్‌రెడ్డి సర్కారుకు ఆరు నెలల్లోనే మూడుసార్లు ధరలు పెంచిన రికార్డు దక్కనున్నది. ఫిబ్రవరిలో బీర్ ధరలు 15 శాతం పెంచిన ప్రభుత్వం, ఈ నెల 18న స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను అమల్లోకి తీసుకొచ్చి క్వార్టర్‌పై రూ.10, హాఫ్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరోసారి ‘మందు’బాదుడుకు సిద్ధమైనట్టు ఎక్సైజ్ శాఖలో చర్చ జరుగుతున్నది.
బీర్లు తయారుచేసే బ్రూవరీలకు బేసిక్ ధరలు పెంచినట్టే, తమకు కూడా బేసిక్ ధరలు పెంచాలని డిస్టిలరీలు, సప్లయ్ కంపెనీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం టీజీబీసీఎల్ చెల్లిస్తున్న బేసిక్ ధర మీద కనీసం 30 శాతం అదనంగా పెంచాలని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాజీ న్యాయమూర్తి జస్టిస్ జైస్వాల్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధరల నిర్ణయ కమిటీని (ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ) నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ అధ్యయనం చేసి, డిస్టిలరీలకు ఇప్పుడిస్తున్న బేసిక్ ధరల మీద కనీసం 15శాతం వరకు అదనపు చెల్లింపులు చేయవచ్చని సూచించినట్టు సమాచారం. ప్రభుత్వం ఈ నెల 18న చీప్ లికర్ బ్రాండ్లు మిగిలిన అన్ని కేటగిరీల మద్యం మీద 7.7శాతం నుంచి 9.9 శాతం ప్రత్యేక ఎక్సైజ్ సెస్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సెస్‌తో రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రూ.2500 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. దీంతో జైస్వాల్ కమిటీ సూచనల ప్రకారం డిస్టిలరీలకు బేసిక్ ధర పెంచి చెల్లిస్తారని అంతా భావించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదు. సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేయాలంటే ప్రభుత్వానికి అదనపు ఆదాయం అవసరమని, దానికోసం మాత్రమే ప్రత్యేక ఎక్సైజ్ సెస్‌ను అమల్లోకి తెచ్చామని ప్రభుత్వం తెగేసి చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
దీంతో డిస్టిలరీలు లిక్కర్ వ్యాపారం చేసే ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. బేసిక్ ధరల మీద కనీసం 15శాతం వరకు అదనపు చెల్లింపులు చేయవచ్చన్న ధరల నిర్ణయ కమిటీ సూచన ఆధారంగా ధరలు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నదట. అయితే.. ఇప్పటికే రెండుసార్లు ధరలు పెంచిన నేపథ్యంలో 10 శాతం మేరకు సవరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇదే జరిగితే బ్రాండ్‌ను బట్టి క్వార్టర్ మీద రూ.10 నుంచి రూ.80 వరకు పెరుగుతుందని తెలుస్తున్నది. డిస్టిలరీలకు పోను ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు రూ.3 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేసినట్టు సమాచారం. పొరుగు రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నాయని, ఇంకా ధరలు పెంచుతూ పోతే, ప్రజలు ఎన్డీపీఎల్, నకిలీ మద్యం వైపు మళ్లుతారని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించినట్టు తెలిసింది. అయినా పట్టించుకోకుండా మరోసారి మద్యం ధరలు పెంచేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం ఫైల్ ముఖ్యమంత్రి వద్ద ఉన్నదని, త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు తెలిపాయి.
మద్యం సరఫరా కోసం ప్రభుత్వం లిక్కర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం జూన్ 30న ముగుస్తున్నది. జూలై ఒకటో తేదీ నుంచి కొత్త ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మద్యం కంపెనీల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వచ్చిన ప్రతిపాదనలకు సంబంధించిన సీల్డ్ కవర్లను తాజాగా తెరిచారు. 92 మద్యం సరఫరా కంపెనీలు కలిసి మొత్తం 604 రకాల బ్రాండ్లను సరఫరా చేయడానికి ముందుకు వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో 47 కొత్త కంపెనీలు (386 బ్రాండ్లు), 45 పాత కంపెనీలు (218 బ్రాండ్లు) ఉన్నట్టు వెల్లడించాయి. కొత్త వాటిలో కర్ణాటక, గోవా, మహారాష్ట్రకు చెందిన డిస్టిలరీలతోపాటు 20 వరకు హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థానిక కంపెనీలు ఉన్నట్టు సమాచారం.