హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి విధివిధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2023-25 ఎక్సైజ్ పాలసీ ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనున్నది. ఈలోగా రాష్ట్రంలోని 2,620 ఏ-4 వైన్‌షాపులకు కొత్తగా టెండర్లు పిలిచి, లైసెన్సుదారులను నిర్ణయించాల్సి ఉన్నది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను విడుదల చేసింది. నూతన ఎక్సైజ్ పాలసీలో నియమ నిబంధనలను పొందుపరుస్తూ తొలి జీవో, దానికి అనుబంధంగా దరఖాస్తు ఫారాన్ని ఖరారు చేస్తూ మరో జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా జీవోల ప్రకారం… ఏ-4 మద్యం దుకాణాలకు రెండేండ్ల లైసెన్స్ కాల పరిమితిని యధాతథంగా ఉంచారు. అయితే, రూ.2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫారం ధరను రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఈ మొత్తం సొమ్ము నాన్ రిఫండబుల్‌గా ప్రభుత్వం పేర్కొన్నది.
‘నమస్తే’ కథనాలతో తగ్గిన ప్రభుత్వం
ఏ-4 మద్యం దుకాణాల లైసెన్స్ కాల పరిమితిని రెండేండ్ల నుంచి మూడేండ్లకు పెంచాలన్న ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం వెనకి తగ్గింది. ఆదాయం పెంచుకునే లక్ష్యంలో భాగంగా మద్యం దుకాణాల కాలపరిమితిని మూడేండ్లకు పెంచేలని సీఎం రేవంత్‌రెడ్డి తొలుత భావించారు. ఆయన సూచనలకు అనుగుణంగానే ఎక్సైజ్ శాఖ మూడేండ్ల కాల పరిమితిని తెర మీదికి తెచ్చింది. అదేవిధంగా దరఖాస్తు పారం ధరను రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలనే ప్రతిపాదనను కూడా తీసుకొచ్చింది. ఈ మొత్తం ప్రక్రియ ద్వారా సుమారు రూ.5 వేల కోట్ల రెవెన్యూ ఒక నెలలోనే వచ్చి చేరుతుందని అంచనా వేసింది. ప్రభుత్వ కసరత్తును పసిగట్టిన ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలు ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మద్యం ద్వారా ప్రభుత్వం డబ్బు సమకూర్చుకుంటున్నదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని, రైతుభరోసా నిధులను మద్యం ద్వారా సమకూర్చుకుంటున్నామనే చెడ్డ పేరు వస్తుందని మంత్రి వర్గం ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది.
మరోవైపు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మద్యం ఆదాయంతోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నదని ఆరోపించారు. మరోవైపు మూడేండ్ల కాల పరిమితి, ఏడాది రెంటల్ డబ్బు అడ్వాన్స్ పెట్టాలనే అంశం మీద మద్యం వ్యాపారులు న్యాయపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం మూడేండ్ల కాల పరమితిపై న్యాయ సలహా కోరినట్టు సమాచారం. చట్ట సవరణ లేకుండా పాలసీ మార్చితే న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయని న్యాయ నిపుణులు హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేసిందని సచివాలయం వర్గాలు చెబుతున్నాయి. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి కల్పించుకొని మరో మెరుగైన పాలసీ ప్రతిపాదనలతో రావాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. దీంతో వారు దరఖాస్తు ఫారం ధర పాలసీలోని అంశం కాదు కాబట్టి దానిని రూ.3 లక్షలకు పెంచి, పాత ఎక్సైజ్ పాలసీనే తిరిగి అమలు చేసినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా..
దరఖాస్తుల దాఖలుకు ఎలాంటి పరిమితులు లేవని, ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా సమర్పించుకోవచ్చని మద్యం పాలసీ నిబంధనల్లో పొందుపరిచారు. కొత్త లైసెన్స్ కాల పరిమితి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఆరు స్లాబుల్లో లైసెన్స్‌లు అమలుచేయనున్నట్టు వెల్లడించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న విధి విధానాలను అనుసరించి ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ జిల్లాల వారీగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ చివరి వారం లోపు నోటిఫికేషన్ వస్తుందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.